‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయలేదు. అయితే తాజాగా.. అసలు ఆర్ఆర్ఆర్ అంటే ఏంటి..? అని టైటిల్.. మోషన్ పోస్టర్‌ను ఉగాది పండుగ రోజున జక్కన్న రివీల్ చేశాడు. ఇందులో ఆర్ఆర్ఆర్ అంటే ‘రౌద్రం రుధిరం రణం’ అని ఇంతవరకూ నెలకొన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఈ టైటిల్, మోషన్ పోస్టర్ వీడియోపై పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇలా కొట్టుకుంటున్నారు!
మరోవైపు మెగాభిమానులు, నందమూరి అభిమానులు, జక్కన్న అభిమానుల మధ్య పెద్ద ఫైటే జరుగుతోంది. అదేమిటంటే.. ఈ సినిమాలో మా హీరోనే గొప్ప అని ఎన్టీఆర్ ఫ్యాన్స్.. మీ వాడికి అంత సీన్లేదు.. మొత్తం మా చెర్రీనే అని మెగాభిమానులు.. అరే ఆపండ్రా బాబూ.. ఇద్దర్నీ మంచిగానే చూపిస్తాడ్లెండి.. ఇరువురి పాత్రధారులకు న్యాయం చేస్తాడులెండి అని జక్కన్న ఫ్యాన్స్ ఇలా సోషల్ మీడియాలో ఫైటింగ్ చేసుకుంటున్నారు. కొందరైతే.. చరణ్‌ను నిప్పులా.. ఎన్టీఆర్‌ను నీటితో పోలుస్తూ.. నిప్పే గొప్పని చెర్రీ అభిమానులు.. అబ్బే నీళ్లే అన్నింటికంటే శక్తివంతమైందని తారక్ ఫ్యాన్స్ వాదించుకుంటున్నారు. ఇంకొందరైతే ఆ మోషన్ పోస్టర్‌లోని ఎన్టీఆర్, చెర్రీ పిక్‌లు కట్ చేసి ఇదిగో మా వాడు ఎలా ఉన్నాడో.. అలా ఇలా అంటూ చిత్ర విచిత్రాలుగా తెగ రెచ్చిపోతున్నారు. ఇంకొందరైతే కావాలనే చెర్రీని ఫస్ట్ ‘ఆర్’ దగ్గర పెట్టి.. లాస్ట్ ‘ఆర్’ మా టైగర్‌ను పెట్టి అవమానించాడని జక్కన్నపై కూడా ఫైర్ అవుతున్నారు.
జర ఆగితే.. తెలుస్తుందిలే..!
సో.. జక్కన్న ఆ ఇద్దర్నీ ఎలా చూపించబోతున్నాడో కానీ.. ఫ్యాన్స్ మధ్య ఫైట్ మాత్రం గట్టిగానే జరుగుతోంది.. రాను రానూ ఇది పెరుగుతుందే కానీ.. అస్సలు తగ్గేలా లేదు. వాస్తవానికి ఇలాంటి గొడవలు వస్తాయనే తెలుగులో కొన్నేళ్ల పాటు మల్టీస్టారర్ సినిమాలు రాలేదన్న విషయం తెలిసిందే. ఎందుకంటే..‘ఇగో’ల వల్ల ఫ్యాన్స్-ఫ్యాన్స్ పొడుచుకుని చచ్చిన రోజులున్నాయ్.. ఈ విషయాలన్నీ అందరికీ గుర్తుండే ఉంటాయ్. అలా హీరోల మధ్య స్నేహం మంచిగానే ఉన్నా.. ఫ్యాన్స్ కొట్టుకుని చస్తున్నారు. చరణ్-ఎన్టీఆర్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనే విషయం తెలుసుకుని అభిమానులు మెలిగితే బాగుంటుందని క్రిటిక్స్ చెబుతున్నారు. వచ్చే ఏడాది జనవరి వరకూ కాస్త ఓపిక పడితే ఎవరు గొప్పు.. ఎవరు కాదు..? ఇద్దరి పాత్రలు సమానమేనా..? రియల్‌లో మాదిరే.. రీల్‌లోనూ ఇద్దరు మిత్రులేనా..? అనేది తేలిపోనుంది.