ప్రస్తుత సమాజంలో మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తున్న చాలా వాటిలో సోషల్ మీడియా కూడా ఒకటి. ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలంటే ఎక్కడ చెప్పలో, ఎలా చెప్తే వారి వరకు చేరుతుందో అర్థం అయ్యేది కాదు. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న మొబైల్ తో ఎవ్వరితోనైనా మాట్లాడవచ్చు. ఎవ్వరి మీదనైనా మన అభిప్రాయం చెప్పవచ్చు. మన భావాలని చెప్పుకోవడానికి, మన గురించి అవతలి వారికి తెలియజేయడానికి సోషల్ మీడియా మంచి వేదిక.
ఈ మీడియా ద్వారా సెలెబ్రిటీలకి సాధారణ జనాలకి దూరం బాగా తగ్గింది. ఇక సినిమా వాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా ద్వారా తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అయితే సీనియర్ హీరోలు ఈ మీడియాకి కొంచెం దూరం ఉంటున్నారు. తెలుగులో నాగర్జున, వెంకటేష్ వంటి హీరోలు సోషల్ మీడియాలో చేరి చాలాకాలం అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంటే చిరంజీవి, బాలక్రిష్ణ దూరంగా ఉంటూ వచ్చారు.
అయితే చిరంజీవి నేడు సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చేశారు. చిరంజీవి కొణిదెల పేరుతో ట్విట్టర్ లోకి వచ్చేశారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ సీనియర్ హీరోలు నలుగురిలో చిరంజీవి కూడా సోషల్ మీడియాకి వచ్చేయడంతో ఇక బాలయ్య బాబు ఎప్పుడు వస్తాడంటూ ప్రశ్నలు అడుగుతున్నారు. మరి బాలయ్య ఈ విషయమై ఏమైనా ఆలోచిస్తారా లేదా చూడాలి.