టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో మందిని.. ఎన్నో విపత్తులు ఎదుర్కొంటున్న వారిని ఆదరించి అక్కున చేర్చుకుంది. కొన్ని ప్రోగ్రామ్స్ చేసి మరీ దాని మీద వచ్చిన డబ్బులను ఇచ్చి కష్ట కాలంలో అండగా ఉండి కన్నీరు తుడిచింది. ఇందుకు ప్రత్యేకించి మరీ ఉదాహరణలు చెప్పనక్కర్లేదు. గతంలో ఏపీలో వచ్చిన హుధూద్ తుఫాన్, కేరళలో వచ్చిన భారీ వర్షాలే. మరోవైపు అదీ ఇదీ అని కాకుండా తమ వంతుగా సందర్భం వచ్చినప్పుడల్లా ఇండస్ట్రీ సాయం చేస్తూనే వచ్చింది. అయితే.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ నటీనటులు పెద్ద మనసు చాటుకుని తమ వంతుగా సాయం చేయాల్సిన టైమొచ్చేసింది.
వణికిస్తున్న మహమ్మారి!
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు దాదాపు షట్ డౌన్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్స్, సినిమా షూటింగ్స్‌ను వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగించారు. ఇప్పటికే.. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేశ్ బాబు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మందే స్పందించి తమ వంతుగా జాగ్రత్తలు, సలహాలు, సూచనలు, చిట్కాలు షేర్ చేసుకున్నారు.
సూచనలు కాదు సాయం!
అయితే.. ఇప్పుడు సలహాలు, సూచనలు అక్కర్లేదు. మీ వంతు సాయం కావాలి. ఎందుకంటే.. తెలుగు రాష్ట్రాలు లాక్‌డౌన్ చేయడంతో పేద ప్రజలు, మరీ ముఖ్యంగా అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మీ వంతుగా సాయం చేసి ఇదివరకటి లాగే పెద్ద మనసు చాటుకోండి. ఇదివరకు మీరెలా పలు సందర్భాల్లో పెద్ద మనసు చాటుకున్నారో అదే విధంగా ఆర్థిక సాయం ప్రకటించండి. పేద ప్రజలు అనేది పక్కనెట్టినా.. ల్యాబ్స్ పరికరాలు కొనుగోలు చేయడానికి కూడా మీ సాయం పనికొస్తుంది. సో.. కమాన్ టాలీవుడ్.. మీ సాయానికై వెయిటింగ్ కమాన్.!.
కమాన్ లెట్స్ హెల్ప్!
కాగా ఇప్పటికే యంగ్ హీరో నితిన్.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చెరో పది లక్షల రూపాయిలు ప్రకటించాడు. ఈ డబ్బును అంటువ్యాధిని ఎదుర్కోవడానికి అవసరమైన పరికరాల నిమిత్తం వాడుకోవాలని చెప్పాడు. సో నితిన్ ఉద్యమం మొదలెట్టాడు.. ఇక చిన్నా పెద్దా.. తేడా లేకుండా మరీ ముఖ్యంగా నిర్మాతలు, దర్శకులు, జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా ఆ విభాగం.. ఈ విభాగం అనే కాకుండా ప్రతి ఒక్కరూ మీ వంతుగా ఆర్థిక సాయం చేయండి. మీ సాయానికై పేద ప్రజలు, అభిమానులు, సినీ ప్రియులు వెయిటింగ్ అక్కడ.. ఇక లేటొద్దు.. టైమొచ్చేసింది కమాన్.. కరోనాపై యుద్ధం చేద్దాం.. సాయం చేసేయండి..!