కరోనా వైరస్ కారణంగా తెలంగాణ అంతటా లాక్ డౌన్ పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. సాధారణ ప్రజలందరూ ఇళ్ళలో ఉంటే పోలీసులు, వైద్యబృందం అంతా కరోనాని తరిమికొట్టడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద పెనుభారం పడనుందని అందరికీ తెలుసు. ఇప్పటికే కరోనా కారణంగా చాలా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. ఉత్పత్తి ఆగిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.
అయితే కరోనా మీద రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న యుద్ధానికి టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తనవంతు సాయాన్ని ప్రకటించాడు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన వంతు సాయంగా చెరో పది లక్షలు ప్రకటించాడు. రాష్ట్రంలో క్లిష్టమైన పరిస్థితులు నెలకొన్న ఇలాంటి సందర్భంలో నితిన్ చేస్తున్న సాయం రాష్ట్రం పట్ల తన బాధ్యతని తెలియజేస్తుంది. తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ దారిలోనే తాను కూడా నడుస్తున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.