తరుణ్ చివరి సినిమా ‘ఇది నా లవ్ స్టోరీ’ వచ్చి రెండేళ్లయిపోయింది. ఆ సినిమా కంటే ముందు నాలుగేళ్ల పాటు అతను విరామం తీసుకున్నాడు. అప్పుడే అతని కెరీర్‌పై సందేహాలు వ్యక్తమయ్యాయి. ‘ఇది నా లవ్ స్టోరీ’ సినిమా చేస్తున్నప్పుడు అతను సినిమాలకు దూరమవ్వలేదనీ, మళ్లీ వస్తున్నాడనీ ఇండస్ట్రీవాళ్లే కాకుండా, సాధారణ ప్రేక్షకులూ అనుకున్నారు. ఆ సినిమా ఎలా వచ్చిందో, అలాగే పోయింది. నాలుగేళ్ల తర్వాత తమ ముందుకు వచ్చాడని ప్రేక్షకులు అతడికి బ్రహ్మరథం పట్టలేదు సరికదా, కనీసం అతడికి ఒక మామూలు విజయాన్ని అందిద్దామని కూడా అనుకోలేదు. ఆ సినిమా ఫ్లాపైపోయింది.
రెండేళ్లు గడిచిపోయాయి. తరుణ్ తాజా సమాచారమేదీ మనకు తెలీడం లేదు. అతను మళ్లీ నటిస్తున్నాడా, లేక తన వ్యాపారం చేసుకుంటూ అదే ఉత్తమమని అందులో మునిగిపోయాడా? బాలనటుడిగా ‘తేజ’ రూపంలో అలరించి, ‘నువ్వే కావాలి’ లాంటి సంచలన చిత్రంతో హీరోగా కెరీర్‌ను ఆరంభించిన తరుణ్ తర్వాత కాలంలో టాప్ స్లాట్‌లోకి వెళ్లడం అనివార్యమని అతని తల్లి రోజారమణి సహా చాలామంది భావించారు. ‘ప్రియమైన నీకు’, ‘నువ్వు లేక నేను లేను’, ‘నువ్వే నువ్వే’ సినిమాలు అతడిని యువ ప్రేక్షకులకు సన్నిహితం చేశాయి. లవర్ బాయ్ ఇమేజ్‌ను తీసుకొచ్చాయి. మనిషి పొట్టివాడైనా స్ఫురద్రూపం, చక్కని నటన, డాన్సులతో అతను ఆకట్టుకున్నాడు.
ఇక స్టార్ హీరో స్టేటస్ ఖాయమని అనుకునే తరుణంలో ఒక్కసారిగా అతని కెరీర్ తిరోగమించింది. సబ్జెక్టులు, క్యారెక్టర్ల విషయంలో అతను వేసిన తప్పటడుగులే దీనికి కారణమని విశ్లేషకుల అభిప్రాయం. ‘నిన్నే ఇష్టపడ్డాను’, ‘ఎలా చెప్పను’, ‘సఖియా’, ‘సోగ్గాడు’, ‘ఒక ఊరిలో’ లాంటి సినిమాలు అందుకు నిదర్శనం. ఇవన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. కెరీర్‌లో ‘నవ వసంతం’ కోసం ఎదురుచూస్తూ ఆ సినిమా చేశాడు. ఫర్వాలేదని జనం చెప్పారు. ఆ తర్వాత బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘బంటీ ఔర్ బబ్లీ’ రీమేక్ ‘భలే దొంగలు’, కృష్ణవంశీ డైరెక్షన్‌లో ‘శశిరేఖా పరిణయం’ చేశాడు. ఈ రెండూ నిజానికి సూపర్ హిట్ కావాలి. కానీ ఆశించిన రీతిలో ఆడలేదు.
అంతే.. ఆ తర్వాత తరుణ్ కెరీర్ అనూహ్యంగా నెమ్మదించింది. ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ సినిమా పదే పదే వాయిదా పడుతూ ‘శశిరేఖా పరిణయం’ వచ్చిన నాలుగేళ్లకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షరా మామూలే.. జనం ఆదరించలేదు. అయినా ఆ వెంటనే ‘యుద్ధం’, ‘వేట’ సినిమాలు వచ్చాయి ఫలితం శూన్యం. రెండూ డిజాస్టర్లే. ఆపైన నాలుగేళ్లకు వచ్చిన ‘ఇది నా లవ్ స్టోరీ’కి అదే ఫలితం. ఇలా ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేని సినీ కెరీర్‌కు తరుణ్.. కామా మాత్రమే పెట్టాడా? ఫుల్‌స్టాప్ పెట్టేశాడా? అని చాలామంది సందేహ పడుతున్నారు. ఇప్పటికే అనేకమంది స్టార్లు టాలీవుడ్‌ను ఏలుతుండగా, అనేకమంది యువ హీరోలు దూసుకుపోవడానికి ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కెరీర్‌లో వెనకపడిపోయిన తరుణ్ పూర్వ వైభవం సాధించడం అసాధ్యమని విశ్లేషకులు అంటున్నారు. తరుణ్ మనసులో ఏముందో మరి?