కొంత కాలం క్రితం తమ గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన డబ్బింగ్ సినిమాల హవా తగ్గిపోవడంతో తెలుగు సినీ నిర్మాతలు హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు. తమిళం నుంచి డబ్బయ్యే సినిమాలే గాక, ఇంగ్లీషు, హిందీ, మలయాళం, కన్నడ సినిమాల డబ్బింగ్ వెర్షన్లు కూడా పరంపరగా దాడి చేస్తూ రావడంతో ఒకానొక కాలంలో తెలుగు స్ట్రెయిట్ సినిమాల నిర్మాతలు ఆందోళనలో మునిగిపోయారు. అంతకుముందు కాలంలో అయితే మలయాళం నుంచి వచ్చిన షకీలా సినిమాలు పేరుపొందిన హీరోల సినిమాల కలెక్షన్లను కూడా ప్రభావితం చేసిన విషయం మనకు తెలుసు. అనంతర కాలంలో షకీలా తెలుగు సినీ రంగానికి వచ్చేయడంతో మలయాళ శృంగార సినిమాల బూమ్ పడిపోయింది.
కానీ ఆ తర్వాత, తమిళంలో హిట్టయిన సినిమాలు ఒకదాని తర్వాత ఒకటిగా తెలుగులో డబ్బయి రావడంతో, టాప్ హీరోల సినిమాలను మినహాయించి, మీడియమ్, స్మాల్ బడ్జెట్ సినిమాలకు థియేటర్లు దొరకడం గగనమైపోయింది. ఆ రోజులు గతించిపోయాయి. ఇప్పుడు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విక్రమ్, విశాల్, విజయ్, కార్తీ వంటి హీరోల సినిమాలు తమిళ ఒరిజినల్‌తో పాటే తెలుగులోనూ ఏక కాలంలో విడుదలవుతున్నాయి. అయితే మొదట ఉన్నంత బూమ్ ఇవాళ వాటికి ఉండటం లేదనేది నిజం. ఇటీవల వచ్చిన డబ్బింగ్ సినిమాల్లో హిట్టనిపించుకున్నది కార్తీ టైటిల్ రోల్ చేసిన ‘ఖైదీ’. దానితో పాటే విడుదలైన విజయ్ సినిమా ‘విజిల్’ కూడా ఫర్వాలేదన్నట్లు ఆడింది.
కానీ ఆ తర్వాత వచ్చిన దండుపాళ్యం 4, విజయ్ సేతుపతి, యాక్షన్, జాక్‌పాట్, మామాంగం, దబంగ్ 3, దొంగ, తూటా, రాజా నరసింహా, అతడే శ్రీమన్నారాయణ, నమస్తే నేస్తమా, దర్బార్, లోకల్ బాయ్.. వంటి సినిమాలు ప్రేక్షకుల్ని ఆశించిన రీతిలో ఆకట్టుకోలేకపోయాయి. వీటిలో సంక్రాంతికి వచ్చిన రజనీకాంత్ మూవీ ‘దర్బార్’.. అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’, మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాల దెబ్బకు ఠా అంది. రష్మికా మందన్న మాజీ లవర్ రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ‘అతడే శ్రీమన్నారాయణ’ సినిమాను ఎంతో ఆర్భాటంతో, ఎంతో పబ్లిసిటీతో రిలీజ్ చేసినా వర్కవుట్ అవలేదు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ‘మామాంగం’, ‘రాజా నరసింహా’ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు. ‘ఖైదీ’గా అలరించిన కార్తీ ‘దొంగ’గా ఆకట్టుకోలేకపోయాడు. ధనుష్ రెండు సినిమాలు ‘తూటా’, ‘లోకల్ బాయ్’ బాక్సాఫీస్ దగ్గర ఫట్‌మన్నాయి. విశాల్ ‘యాక్షన్’ ఆకట్టుకోలేదు. ఇటీవల ‘మహానటి’ మూవీతో మనకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ సినిమా ‘కనులు కనులను దోచాయంటే’ చిత్రం తొలివారం కంటే రెండో వారంలో కలెక్షన్లను పెంచుకొని మంచి టాక్‌తో హిట్ దిశగా దూసుకుపోతున్నదని అనుకొనేంతలో థియేటర్ల మూసివేత దానికి శాపంగా మారింది.
ఏదేమైనా తెలుగులో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల స్థానంలో సరికొత్త కథా కథనాలతో సినిమాలు వస్తుండటం వల్లే డబ్బింగ్ సినిమాల పప్పులు ఉడకడం లేదనేది విశ్లేషకుల మాట. ఇదే ఊపులో ఆహ్లాదకర సినిమాలు మరిన్ని వస్తే తెలుగు చిత్రసీమ శోభాయమానంగా వర్ధిల్లుతుందనడంలో సందేహం లేదు. అప్పడు డబ్బింగ్ సినిమాలకు తెలుగునాట చోటూ ఉండదు.