త్వరలో ‘మా-ఏపీ’ ఎన్నికలు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ కార్యవర్గం పదవీకాలం ముగిసిన కారణంగా, నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించనున్నట్లుగా మా-ఏపీ వ్యవస్థాపకుడు, సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా, తెనాలిలోని మా-ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మా-ఏపీ ఎన్నికల వివరాలను పేర్కొన్నారు. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న సినీ నటి కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలుగా అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు. లేదంటే తిరిగి ఎన్నికలలో పోటీ చేయుటకు ఎన్నికల షెడ్యూలు విడుదల అయ్యాక నామినేషన్‌లు వేసుకోవచ్చని ఆయన చెప్పారు. అయితే ఈసారి మా-ఏపీ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో ఎన్నికల బరిలోకి వచ్చే అవకాశాలున్నాయని దిలీప్ రాజా వివరించారు. మా-ఏపీలో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుందన్నారు. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదన్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందిన 24 శాఖల సాంకేతిక నిపుణులు, అలాగే నటీనటులు ఆయా కేటగిరీల కింద పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు. అధ్యక్ష, కార్యదర్శిల ఎన్నికలతో పాటు కెమెరా, ఎడిటింగ్, కొరియోగ్రఫీ, డాన్సింగ్, మేకప్, ట్రాన్స్‌పోర్ట్ తదితర విభాగాలు కూడా ఒక్కొక్క కేటగిరి నుంచి ఒకరిని కార్యవర్గ సభ్యులుగా తీసుకుంటామని ఆయన చెప్పారు. కరోనా వైరస్ వలన ఈ నెల 20 నుంచి 31 వరకు ఏపీలో షూటింగ్‌లను నిలిపివేసినట్లుగా ఆయన తెలిపారు. యూనియన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణీత వ్యవధిలో షూటింగ్‌లు జరిపితే ఆయా వ్యక్తుల శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. కరోనా ప్రభావంపై ఏప్రిల్ 1న మా-ఏపీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఏపీలో ఎప్పటి నుంచి షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చునో ప్రకటించడం జరుగుతుందని ఈ సమావేశంలో దిలీప్ రాజా తెలిపారు.
దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్ వడ్లమూడి, ప్రొడక్షన్ మేనేజర్ భాస్కర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.