‘బాహుబలి’ సినిమాతో తన సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RRR’. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ నటిస్తున్నారన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ ఫలానా పాత్రల్లో నటిస్తున్నారని మాత్రమే చెప్పిన జక్కన్న.. ఇంతవరకూ చిన్నపాటి లుక్ గానీ రిలీజ్ చేయలేదు. అయితే.. వచ్చే ఏడాది అనగా జనవరి-8, 2021న రిలీజ్ చేస్తామని మాత్రం చెప్పాడు. అయితే ఈ సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయ్. బాహుబలి రికార్డ్స్‌ను బద్ధలు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని కూడా విశ్లేషకులు అనుకుంటున్నారు.
ఇక అసలు విషయానికొస్తే.. ఈ సినిమా తర్వాత జక్కన్న ఏం చేయబోతున్నాడు..? ఎవరితో సినిమా చేయబోతున్నాడు..? అసలు సినిమా చేసే ఆలోచన ఉందా..? లేకుంటే మళ్లీ మరో ఏడాది వరకూ చెక్కుడే పనిగా పెట్టుకుంటారా..? అనేది తెలియరాలేదు కానీ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పుకారు మాత్రం టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. అదేమిటంటే.. రాజమౌళి తదుపరి సినిమా కుర్ర హీరో.. ‘ఇస్మార్ట్ శంకర్’ గ్రాండ్ సక్సెస్ మాంచి ఊపుమీదున్న రామ్ పోతినేనితో సినిమా చేయనున్నాడన్నదే ఆ పుకారు సారాంశం. ఎంతో మంది హీరోలు జక్కన్న కోసం వేచి చూస్తున్నా ఈయన మాత్రం రామ్‌నే హీరోగా పెట్టి చేయాలని అనుకుంటున్నాడట.
రామ్ కోసం రాజమౌళి తండ్రి రాజేంద్ర ప్రసాద్ కథ కూడా పూర్తి చేశాడని వార్తలు వినిపిస్తున్నాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగితే రామే స్వయంగా ప్రసాద్ దగ్గరికెళ్లి కథ వినివస్తాడట. ప్రస్తుతం ‘రెడ్’ సినిమాలో బిజీబిజీగా ఉన్నాడు. గ్యాప్ చూసుకొని వెళ్లి కథ వినాలని అనుకుంటున్నాడట. అయితే ఈ కథకు దర్శకత్వం మాత్రం జక్కన్నే అట. అసలు కుర్రాడి కోసం రాజేంద్ర ప్రసాద్ కథ రెడీ చేయడమేంటి..? అసలు ఇది ఎంతవరకు నిజం..? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.