మెగాస్టార్ చిరంజీవి- సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ కాంబోలో సినిమా (ఆచార్య) షూటింగ్ విజయవంతంగా నడుస్తుండగా కరోనా దెబ్బ పడటంతో ఆపేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు షూటింగ్ ఆపేస్తున్నట్లు చిరు అధికారికంగా ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత అందరూ పెద్దన్న చెప్పినట్లే ఫాలో అయ్యారు.. షూటింగ్‌లు, సినిమా రిలీజ్‌లు రద్దు చేసుకున్నారు. అంతా సరే కానీ.. కరోనా దెబ్బ మెగాస్టార్ సినిమాపై గట్టిగానే పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. షూటింగ్‌కు బ్రేక్ పడటం, సినిమా హీరోయిన్ సెట్ ఇంకా సెట్ అవ్వకపోవడం, సెట్ అయినా వరుస షాకులిస్తుండటం.. మరోవైపు యంగ్ మెగాస్టార్ పాత్రకు ఎవరో క్లారిటీ రాకపోవడంతో ఇలా వరుస అడ్డంకులు వచ్చి పడ్డాయ్.
ఈ సమస్యలు అన్నీ తీరాలంటే ఒక నెల ఆగి షూటింగ్ షురూ చేసిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ ఏడాది రిలీజ్ చేయడం చాలా కష్టమే. మరీ ముఖ్యంగా ముందుగా అనుకున్న ఆగస్ట్-14 తారీఖుకు అస్సలు షూటింగ్ అయిపోవడమే పెద్ద గగనమని సినీ క్రిటిక్స్ చెబుతున్నారు. ఒకవేళ అన్నీ సెట్ అయినా షూటింగ్ షెడ్యూల్ వేసుకోవడం.. ఆర్టిస్టులందర్నీ సమీకరించుకోవడం.. వాళ్లు డేట్స్ కోసం వేచి చూడటం.. ఇలా చాలానే సమయం తీసుకుంటుంది.
మొత్తానికి చూస్తే.. ఎంత తొందరపడినా.. ఈ ఏడాది సినిమా షూటింగ్ అయిపోతుందే తప్ప.. సినిమా రిలీజ్ మాత్రం కష్టమని దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. మరి కొరటాల ఏమైనా మ్యాజిక్ చేసి షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది చివరికైనా తెస్తాడా..? లేకుంటే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత నిదానంగా రిలీజ్ చేసుకుంటాడా..? అనేది తెలియాల్సి ఉంది. పోస్ట్ పోన్ జరిగితే మాత్రం మెగాభిమానుల్లో చివరికి నిరాశ.. నిస్పృహలే మిగిలుతాయ్.