కరోనా వైరస్ ప్రపంచాన్ని గడ గడలాడిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు సైతం పాకడంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటికి రావాలన్నా.. బయటి దేశాలనుంచి ఇంటికి రావాలన్నా జంకిపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, థియేటర్స్ సైతం బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో విద్యాసంస్థలు మొదలుకుని పబ్‌లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ దాదాపు అన్నీ మూసేయించారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సినిమా సెలబ్రిటీలు తమవంతుగా జనాల్లో చైతన్యం కలిగిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్-రామ్ చరణ్ ఇలా చెప్పుకుంటూ చాలా మందే వీడియోల రూపంలో.. సోషల్ మీడియా వేదికగా సలహాలు, సూచనలు, ట్రిక్స్ చెప్పారు.
అయితే.. మంచు మనోజ్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి ‘మంచు’ మంచితనాన్ని చూపించాడు.!. వాస్తవానికి సామాజిక సేవ అంటే మంచు వారబ్బాయి ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. ఇప్పటికే ఎన్నో సమాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన ఆయన.. కరోనా వైరస్ విజృంభిస్తోన్న తరుణంలో తనవంతుగా సాయం చేయడానికి మరో ముందడుగు వేశాడు. ప్రస్తుతం బయట హ్యాండ్ శానిటైజర్లు, మాస్క్‌ల కొరత ఏర్పడటం.. పేద ప్రజలు ఈ శానిటైజర్లను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి ఉండటంతో వారికి అండగా.. అభయం చెబుతూ మనోజ్ రంగంలోకి దిగాడు.
మీకు నేనున్నా..!
‘మాస్క్‌లు, శానిటైజర్లను కొనుగోలు చేసుకునే స్తోమతలేని వారికి, అసలు వీటిపై సరైన అవగాహన లేనివారికి నా వంతు సాయంగా వాటిని పంపిణీ చేస్తున్నాను. అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని.. భద్రతగా ఉండాలి’ అని ట్విట్టర్ వేదికగా మనోజ్ షేర్ చేసుకున్నాడు. మంచి పనులు చేస్తున్న మంచు వారబ్బాయికి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి. మీరు సినిమాల పరంగానే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరోనే అని నెటిజన్లు, అభిమానులు, సినీ ప్రియులు మెచ్చుకుంటున్నారు.