కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన ఈ వైరస్ ఇప్పటికే ప్రపంచ దేశాలకు విస్తరించింది. తెలుగు రాష్ట్రాలకు సైతం పాకడంతో ప్రజలు వణికిపోతున్నారు. బయటికి రావాలన్నా.. బయటి దేశాలనుంచి ఇంటికి రావాలన్నా జంకిపోతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ పెద్దలు కూడా సినిమా రిలీజ్‌లు, షూటింగ్‌లు, థియేటర్స్ సైతం బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రంలో విద్యాసంస్థలు మొదలుకుని పబ్‌లు, జిమ్‌లు, షాపింగ్ మాల్స్ దాదాపు అన్నీ మూసేయాలని ఆదేశించారు.
ఇదిలా ఉంటే.. కరోనా విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి అలియాస్ జక్కన్న సలహాలు, సూచనలు చేసిన విషయం విదితమే. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోలు, ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తగు జాగ్రత్తలు సూచించారు. 01:20 నిమిషాల నిడివి గల ఓ వీడియోను విడుదల చేసిన ఈ ఇద్దరూ ఇందులో చిన్న చిట్కాలు పాటిస్తే చాలంటూ నిశితంగా వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించిన ఈ ఆరు సూత్రాలను పాటిస్తే కోవిడ్-19 నుంచి మనం చాలా సులువుగా బయటపడగలమని ఆ వీడియోలో తెలిపారు.
చిట్కాలు ఇవీ..
- చేతులు సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోండి. గోళ్ల సందుల్లో కూడా. బయటికి వెళ్లివచ్చినప్పుడు లేదా భోజనానికి ముందు ఇలా కనీసం రోజుకు 7, 8 సార్లు శుభ్రం చేసుకోవాలి
- కరోనా వైరస్ తగ్గే వరకు తెలిసిన వాళ్లు ఎదురుపడితే కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయండి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి.
- మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్క్‌లు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్ -19 మీకంటుకునే ప్రమాదం ఉంది.
- తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతులు అడ్డుపెట్టుకోకుండా, మోచేతిని మాత్రమే అడ్డుపెట్టుకోవాలి.
- జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లకండి. మంచినీళ్లు ఎక్కువ తాగండి. గడగడ ఒకేసారి తాగేకన్నా.. ఎక్కువసార్లు కొంచెం కొంచెం తీసుకోండి. వేడినీళ్లు అయితే ఇంకా మంచిది.
- వాట్సప్‌లో వచ్చే ప్రతీ వార్తని దయచేసి నమ్మేయకండి. వాటిలో నిజం ఎంతో తెలియకుండా ఫార్వార్డ్ చేయకండి.
- కోవిడ్-19 మీద గవర్నమెంట్ ఇచ్చే సలహాలు, అప్డేట్స్ తప్పకుండా పాటిద్దాం. మనల్ని మనమే రక్షించుకుందాం. పరిశుభ్రత పాటించండి అని ఎన్టీఆర్ చెప్పగా.. స్టే సేఫ్ చెర్రీ అంటూ వీడియోను ముగించారు.
తారక్, చరణ్ చెబితే పాటిస్తారా?
మొత్తానికి చూస్తే.. కరోనాపై ఆర్ఆర్ఆర్ టీమ్ గట్టిగానే యుద్ధం చేస్తూ.. రాజమౌళి, చెర్రీ, ఎన్టీఆర్ సలహాలు సూచనలు ఇవ్వడం మంచి పరిణామమేనని చెప్పుకోవచ్చు. కాగా తాజా వీడియోను అటు మెగాభిమానులు.. ఇటు నందమూరి అభిమానులు, జక్కన్న అభిమానులు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ.. లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు.. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో కూడా బాగా వైరల్ అవుతోంది. మరి స్టార్ హీరోలు చెప్పిన మాటలను.. సూచనలను అభిమానులు, సినీ ప్రియులు, సామాన్య జనాలు ఏ మాత్రం పాటిస్తారో చూడాలి.