కన్నడ సూపర్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ డేట్ వచ్చేసింది. దసరా సెలవుల్ని లక్ష్యంగా చేసుకున్న ఈ సినిమా మిగతా భాషల భారీ సినిమాల కంటే ముందుగా కర్చీఫ్ వేసేసింది. పాన్ ఇండియా మూవీగా అక్టోబర్ 23న ఆ సినిమా కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్నది. దీంతో ఒకవేళ దసరా సెలవులపై కన్నేసిన టాలీవుడ్, బాలీవుడ్‌కు సంబంధించిన టాప్ హీరోల, టాప్ డైరెక్టర్ల సినిమాలు మరో డేట్‌ను వెతుక్కోక తప్పని స్థితి. ఎందుకంటే ‘కేజీఎఫ్’ ఫ్రాంచైజ్ క్రేజ్ అలా ఉంది.
2018 డిసెంబర్‌లో వచ్చిన ‘కేజీఎఫ్’ సినిమా కన్నడంలోనే కాకుండా తెలుగు, హిందీ భాషల్లోనూ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టి, యష్‌ను సెన్సేషనల్ స్టార్‌గా, ప్రశాంత్ నీల్‌ను ఇండియన్ స్టార్ డైరెక్టర్స్‌లో ఒకడిగా మార్చేసింది. ఆ సినిమా హిందీ వెర్షన్ పాకిస్తాన్‌లోనూ విడుదలై హిట్టవడం విశేషం. ఇంకా విశేషమేమంటే, రాకీ క్యారెక్టర్‌లో యష్ వీరవిహారం చేసిన ఆ చిత్రం అమెరికాలో రి-రిలీజ్ కావడం! ఇలాంటి సంచలనాలు రికార్డ్ చేసిన ‘కేజీఎఫ్’కు సీక్వెల్‌గా చాప్టర్ 2 వస్తుందని ఎనౌన్స్‌మెంట్ వచ్చిన క్షణం నుంచే దేశవ్యాప్త సినీ ప్రియులు ఆ సీక్వెల్ కోసం ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురు చూస్తున్నారు.
నిజానికి ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వస్తుందని యష్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. 2019 మార్చిలో ఈ సినిమా ఓపెనింగ్ జరిగినప్పుడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, ప్రొడ్యూసర్ విజయ్ కిరంగదూర్ 2020 సమ్మర్‌కి ఈ సినిమా తీసుకొస్తామని చెప్పారు. కానీ షూటింగ్ షెడ్యూల్స్ అనుకున్న విధంగా జరగకపోవడంతో సినిమా పూర్తి కాలేదు. దీంతో తాజాగా దసరా పండగని లక్ష్యంగా చేసుకొని రిలీజ్ డేట్‌ను అక్టోబర్ 23గా ప్రకటించారు. ఆ టైమ్‌లో టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలేవీ విడుదలయ్యే అవకాశాలు లేవు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘విరూపాక్ష’, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ఓ డియర్’ సినిమాలు దీపావళి లేదా క్రిస్టమస్‌ను లక్ష్యంగా చేసుకొని విడుదల కానున్నాయి. బాలీవుడ్‌లోనూ ఏ టాప్ స్టార్ సినిమా కూడా ఆ టైమ్‌లో రిలీజ్ కావట్లేదు. ఒక్క అభిషేక్ బచ్చన్ మూవీ ‘బిగ్ బుల్’ మాత్రమే అక్టోబర్ 23న విడుదల కానున్నది. ప్రస్తుతం అభిషేక్ స్టార్ హీరో కాదు. ‘కేజీఎఫ్ చాప్టర్ 2’కు ఉన్న క్రేజ్ ఆ సినిమాకు లేదు. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. రాకీ విల్ రాక్!