తెలుగులో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్న నిర్మాతల్లో మొట్టమొదటగా గుర్తొచ్చే పేరు దిల్ రాజు. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే ఆ సినిమాలో ఎంతోకొంత విశేషం ఉండే ఉంటుంది అనే అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే ఎంత సక్సెస్ ఫుల్ నిర్మాత అయినా ఏదో ఒక సందర్భంలో ఫ్లాపుల బాట పడుతుంటారు. ప్రస్తుతం దిల్ రాజు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఈ మధ్య ఆయన నిర్మించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. అటు సూపర్ స్టార్లతోనూ ఇటు చిన్న హీరోలతోనూ సినిమాలు తీసే దిల్ రాజు తన బ్యానర్ ద్వారా వారసుడిని పరిచయం చేయబోతున్నాడట.
తెలుగు ఇండస్ట్రీలో వారసులకి కొదవలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్లందరూ వారసులే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకైన ఆశిష్ రెడ్డి హీరోగా పరిచయం అవబోతున్నాడు. పలుకే బంగారమాయేరా అనే టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని హుషారు ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి డైరెక్ట్ చేస్తాడట. ప్రస్తుతానికి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. దిల్ రాజు సినిమా అంటేనే ఎంతో కొంత హడావిడి ఉంటుంది. అలాంటిది మరి హీరోనే పరిచయం చేస్తున్నాడంటే ఇంకెంత హడావిడి చేస్తాడో చూడాలి.