టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ ఊపు ఊపిన చెన్నై పొన్ను, దక్షిణాది స్లిమ్ బ్యూటీ త్రిషను సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. జూనియర్, సీనియర్ అనే తేడా లేకుండా దాదాపు తెలుగులో అందరి హీరోల సరసన ఈ ముదరు భామ నటించేసింది. అలా దశాబ్ధానికి పైగా హీరోయిన్‌గా ఈ బ్యూటీ రాణిస్తోంది. ఇక అసలు విషయానికొస్తే.. సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌లో త్రిష కూడా ఒక్కటన్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ భామ ఈ మధ్య పెళ్లి విషయమై పదే పదే వార్తల్లో నిలుస్తోంది.
ఇటీవలే ఓ వీరాభిమాని పెళ్లి విషయం ప్రస్తావనకు తేగా.. వివాహ వ్యవస్థపై తనకు అస్సలు నమ్మకం లేదని.. అయితే నచ్చిన మగాడు దొరికి, పెళ్లంటూ చేసుకుంటే వెగాస్‌లోనే చేసుకుంటానని మనసులోని మాటను బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్య్వూలో మరోసారి పెళ్లి ప్రస్తావన రాగా.. ఈసారి ఇంకాస్త వెరైటీగా సమాధానం ఇచ్చింది. మీకు ఎలాంటి వాడు భర్తగా రావాలనుంటున్నారు..? అసలు మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా..? అనే ప్రశ్న ఎదురైంది. ‘నాకు పెద్దగా అందగాడేమీ అక్కర్లేదు. కేవలం నన్ను బాగా చూసుకునే వాడైతే చాలు. అవసరం అనుకుంటే రేపే పెళ్లి చేసుకోడానికి సిద్ధం.. కానీ సరైన వాడు దొరకట్లేదు. నాకు కాబోయే వాడు హీరోలా ఉండాలనే కండిషన్, రిక్వైర్మెంట్స్ అస్సలు లేవు. నా నలుపు అంటే ఇష్టం. నా పెళ్లి విషయంలో పెద్దల జోక్యం ఏ మాత్రం ఉండదు. ఎవర్నీ పెళ్లాడినా అంతా నా ఇష్ట ప్రకారమే చేసుకుంటా’ అని బదులిచ్చింది.
మొత్తానికి చూస్తే.. ఒకసారి పెళ్లి పెటాకులయ్యేసరికి ఇక ఇంట్లో వాళ్లు చెప్పిన సంబంధం కాకుండా తన ఇష్ట ప్రకారమే చేసుకోవాలని త్రిష గట్టిగా ఫిక్సయ్యిందని దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. మరి త్రిష మనసులో ఎవరైనా ఉన్నారా..? ఒకవేళ ఉంటే ఎవరు..? త్రిష చెబుతున్నట్లుగా భర్తగా వచ్చే నలుపున్న ఆ డ్రీమ్ ఎవరు..? అనేది తెలియాలంటే ముదురు భామ పెళ్లయ్యేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.