టాలీవుడ్ మెగా హీరోలు సుమారు క్రికెట్ టీమ్ అంత మంది ఉన్నారు. వీరిలో చాలా వరకు సక్సెస్ అవ్వగా.. మరికొందరు మాత్రం సక్సెస్ కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. వీరిలో అల్లు శిరీష్ ముందు వరుసలో ఉంటాడు. వాస్తవానికి శిరీష్ మంచి నటుడు.. ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తుంటాడు.. కానీ సరైన కథలు, సరైన డైరెక్టర్ దొరక్కపోవడంతో అనుకున్న రేంజ్‌కు వెళ్లలేకపోతున్నాడు. అయితే అదే ఫ్యామిలీ నుంచి వచ్చిన బ్రదర్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అలియాస్ బన్నీ మాత్రం దూసుకుపోతున్నాడు. మరీ ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ రికార్డ్ స్థాయిలో హిట్టవ్వగా.. బన్నీ కెరీర్‌లో ఇదో మైల్ స్టోన్‌గా నిలిచిపోయింది. మున్ముంథు ఇదే ఊపుతో తన రికార్డ్‌ను తానే బద్ధలు కొట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అయితే.. బన్నీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు సరే.. అల్లు శిరీష్ సంగతేంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. శిరీష్ ఇప్పటి వరకూ నటించిన సినిమాల్లో ఆశించినంత ఫలితాలు రాలేదు. బన్నీ బ్రదర్, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, సొంత బ్యానర్లు ఉన్నప్పటికీ లక్ మాత్రం కలిసిరావట్లేదు. అదేదో సామెత ఉంది కదా.. ‘అన్నీ ఉన్నా..’ అన్నట్లుగా ఉంది శిరీష్ పరిస్థితి. రీమేక్ సినిమా ‘ఏబీసీడీ’లో నటించిన తర్వాత కుర్ర హీరో చాలా గ్యాప్ తీసుకున్నాడు. దీంతో రకరకాలుగా వార్తలు వినిపించేస్తున్నాయ్. ఇక సినిమాలకు దూరంగా ఉంటూ.. బిజినెస్ పనులు చూసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయ్. అంతేకాదు.. ఇక ముందు ఆయన సినిమాల్లో నటించడం కష్టమని పుకార్లు వస్తున్నాయ్.
అల్లు శిరీష్‌కు అన్ని విధాలా అవకాశాలు ఉండి కూడా ఎందుకు సినిమా చేయట్లేదు..? మంచి కథ దొరకలేదా..? హిట్ డైరెక్టర్ దొరకలేదా..? అనే ప్రశ్నలూ మెదులుతున్నాయ్. మరోవైపు బన్నీని పట్టించుకున్న అల్లు అరవింద్.. శిరీష్ విషయంలో మాత్రం చాలా దూరంగా పెట్టేస్తూ వస్తున్నాడు. మరి దీని వెనుక ఉన్న మతలబేంటి..? కొంపదీసి తండ్రీ కొడుకుల మద్య ఏమైనా జరిగిందా..? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయ్. సో.. ఇందులో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.