విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ‘మనం’ మూవీ అక్కినేని ఫ్యామిలీకి ఒక మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది. కారణం.. ఆ సినిమాలో ఆ ఫ్యామిలీలోని మూడు తరాల నటులు ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించడమే. క్లైమాక్స్‌లో అఖిల్ కూడా వాళ్లకు తోడై మరింత రక్తి కట్టించాడు. ఆ సినిమా తర్వాత అఖిల్‌తో విక్రమ్ రూపొందించిన ‘హలో’ సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. ఆ సినిమా స్ర్కిప్ట్‌లో నాగార్జున అవసరానికి మించి జోక్యం చేసుకోవడం వల్లే ఫైనల్ ఔట్‌పుట్ అలా వచ్చిందనే ప్రచారం ఉంది.
కాగా ఇప్పుడు నాగచైతన్యతో సినిమా చెయ్యాలని విక్రమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన చైతూని కలిసి లైన్ చెప్పినట్లు, చైతూ కూడా దానిపై ఇంట్రెస్ట్ చూపినట్లు విశ్వసనీయ వర్గాల భోగట్టా. మరోసారి వారి మధ్య మీటింగ్ జరగనున్నదనీ, అప్పుడు విక్రమ్ ఫైనల్ నెరేషన్ ఇస్తాడనీ ఆ వర్గాలు తెలిపాయి. చూస్తుంటే ఆ ఇద్దరి కాంబినేషన్ సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’ చిత్రం చేస్తున్నాడు. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో క్రేజ్ తెచ్చుకుంది. చైతూ-పల్లవి ఫస్ట్ కాంబినేషన్, చైతూ-శేఖర్ ఫస్ట్ కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తిస్తుండటం ఇందుకు ఒక కారణమైతే, శేఖర్-పల్లవి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన ‘ఫిదా’ మూవీ బ్లాక్‌బస్టర్ కావడం మరో కారణం. ఇప్పటికే చైతూ-పల్లవి జోడీ ఫస్ట్ లుక్‌కు వచ్చిన రెస్పాన్స్ కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచింది. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ చిత్రం తర్వాత విక్రమ్‌తో చైతూ సినిమా చేస్తాడేమో చూడాలి.