తెలుగు సినిమాల్లో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ నడుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక్కోసారి మాస్ సినిమాలు రాజ్యమేలుతుంటే, మరోసారి అన్ని క్లాస్ సినిమాలు వస్తుంటాయి. అయితే సినిమా అనేది వ్యాపారం కాబట్టి ప్రేక్షకులు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారో చూసుకుని అందరూ అదే దారిలో వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. తద్వారా తాము కూడా విజయం సాధించాలని తపిస్తుంటారు. అయితే ప్రస్తుతం తెలుగులో రీమేక్ ల ట్రెండ్ నడుస్తుంది.
పరభాషల్లో విజయం సాధించిన సినిమాలని మన ప్రేక్షకులకి తగ్గట్టు తెరకెక్కించి వదులుతున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మొదలుకుని వెంకటేష్ నారప్ప, రామ్ పోతినేని రెడ్, బాహుబలి నిర్మాతల నుండి వస్తున్న ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య మొదలగు చిత్రాలన్నీ తెలుగు తెర మీద ఆడడానికి రెడీ అవుతున్నాయి. ఈ రీమేక్ చిత్రాల అవసరం ప్రస్తుతం రవితేజకి బాగా వచ్చిందని అంటున్నారు. రవితేజ గత కొన్ని రోజులుగా బ్యాడ్ ఫేజ్ ఎదుర్కొంటున్నాడు.
అందువల్ల ఈ సారి వచ్చే సినిమా రీమేక్ అయితేనే బెటర్ అని మాట్లాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు వస్తున్న క్రాక్ సినిమా తమిళ చిత్రమైన సేతుపతికి రీమేక్ అనే చర్చ నడుస్తోంది. ఈ విషయంలో చిత్ర బృందం ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికీ టీజర్ లోని సన్నివేశాలని చూస్తే అలాగే కనిపిస్తుందని చెప్తున్నారు. మరి రీమేక్ అవసరమైన రవితేజ ఈ అన్ అఫిషియల్ రీమేక్ తోనైనా హిట్ కొడతాడేమో చూడాలి.