చైనా లో మొదటగా గుర్తించిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా డెభ్బై దేశాలకి పైగా విస్తరించిందని వార్తలు వస్తున్నాయి. మొత్తం ఏడు ఖండాలలో అంటార్కిటికా మినహా అన్ని ఖండాలకి ఈ వైరస్ వ్యాపించినట్లు చెబుతున్నారు. అయితే తాజాగా తెలంగాణలో కూడా ఈ వైరస్ కేసు నమోదయిన విషయం తెలిసిందే. దాంతో హైదరాబాద్ వాసుల్లో భయాందోళనలు బాగా ఎక్కువయ్యాయి. ఈ భయాందోళనలు వ్యాపారాలకి తీవ్ర నష్టం కలుగజేసేలా ఉన్నాయి.
కరోనా భయం వల్ల జనాలు గుంపులుగా ఉండకూడదని, షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని ఊదరగొడుతున్న నేపథ్యంలో మా (మూవీ ఆర్టిస్ట్) మేల్కొని అత్యవసర మీడియా సమావేశం నిర్వహించింది. జనాలు గుంపులుగా తిరగకూడదని అంటే సినిమాలు చూడడానికి రావడం మానేస్తారన్న ఉద్దేశ్యంతో మా మీడీయా ముందుకు వచ్చి థియేటర్లలో పాటించాల్సిన జాగ్రత్తలు చెప్తూ, రక్షణ కల్పించడానికి కావాల్సిన సౌకర్యాలు థియేటర్లలో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
అలాగే షూటింగ్ లు ఆగిపోతాయని వస్తున్న వార్తలకి స్పందిస్తూ, అలాంటిదేమీ జరగదని, షూటింగ్ లు యధావిధిగా జరుగుతాయని, కానీ అక్కడ తీసుకోవాలిన జాగ్రత్తల్నిమరింత పటిష్టంగా తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మూవీ ఆర్టిస్ట్ ముందుకొచ్చి ఎంతలా చెప్పినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఎవరెన్ని చెప్పినా జనాలు గుంపుగా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళకపోవడమే మంచిదని అనుకుంటున్నారు. మరి మా చెప్పిన మాటలు వింటారా అనేది సందేహమే.