టాలీవుడ్ కి మార్చ్ నెలని డ్రై మంత్ గా చెప్పవచ్చు. ఈ నెలలో మొదటి వారం, చివరి వారం మినహయిస్తే బాక్సాఫీసు వద్ద రిలీజ్ అయ్యే సినిమాలేవీ కనిపించట్లేవు. మొదటి వారం మూడు సినిమాలు రిలీజ్ అవుతుండగా, చివరి వారం చెప్పుకోదగ్గ చిత్రమైన నాని వి సినిమాతో పాటుగా సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తున్న అమృతరామమ్ కూడా ఉంది. అయితే వాటిని పక్కన పెడితే రేపు రిలీజ్ అవుతున్న మూడు సినిమాల విషయానికి వస్తే అనుకున్నదొకటి అయినదొకటి, పలాస 1978, ఓ పిట్టకథ చిత్రాలు వరుసలో ఉన్నాయి.
ఈ మూడు చిత్రాలు మూడు విభిన్నమైన చిత్రాలుగా కనిపిస్తున్నాయి. పలాస 1978 పీరియాడిక్ డ్రామాగా కనబడితే, స్వేఛ్ఛని కోరుకునే నలుగురు అమ్మాయిల కథగా అనుకున్నదొకటి అయినదొకటి, ముక్కోణపు ప్రేమకథగా ఓ పిట్టకథ కనబడుతుంది. ఈ మూడు చిత్రాలు వేటికవే ప్రత్యేకంగా కనబడడమే కాదు ప్రమోషన్ లో కూడా ఆ వైవిధ్యం కనిపిస్తుంది. ముఖ్యంగా పలాస 1978 కి బాగా బజ్ ఏర్పడింది.
మొన్నటి వరకు ఓ పిట్టకథని ఓ మామూలు సినిమాగానే చూసినవాళ్ళు ఇప్పుడు ఓ ప్రత్యేకమైనదిగా చూస్తున్నారు. దానికి ముఖ్య కారణం చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఓ పిట్టకథ ప్రీ రిలీజ్ కి వచ్చినప్పటి నుండి ఆ సినిమా మీద జనాల్లో బాగా ఆసక్తి పెరిగింది. అంతే కాదు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు ఈ సినిమాలో ఒక హీరోగా నటిస్తుండడం వల్ల బ్రహ్మాజీతో స్నేహంగా ఉండే చాలా మంది సెలెబ్రిటీలు ఈ సినిమా గురించి ప్రమోట్ చేస్తున్నారు.
దాంతో ఓ పిట్టకథ గురించి సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తునే చర్చ నడుస్తుంది. రిలీజ్ కి ఒకరోజు ముందు ఎంతో పెద్దగా వినిపిస్తున్న పిట్టకథ కూత రిలీజ్ తర్వాత కూడా కొనసాగుతుందా లేదా చూడాలి.