Advertisement
Google Ads BL

ఇంటర్వ్యూ: ‘క్షీరసాగర మథనం’ దర్శకుడు


వినూత్న కథ కథనాలతో కట్టిపడేసే కమనీయ చిత్రం ‘క్షీరసాగర మథనం’తో దర్శకుడిగా మారుతున్న ఐ.టి.రంగ నిపుణుడు అనిల్ పంగులూరి

Advertisement
CJ Advs

ఐ.టి. రంగం నుంచి సినిమా దర్శకత్వంలోకి వచ్చినవాళ్లంతా దాదాపుగా సక్సెస్ అయ్యారు. ఆ జాబితాలో ‘అనిల్ పంగులూరి’ అనే మరో పేరు చేరుతోంది. ఓ ప్రఖ్యాత బహుళ జాతీయ సంస్థలో ఉన్నతోద్యోగిగా ఉన్న అనిల్ ‘క్షీరసాగర మథనం’ పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించారు. తెలుగు నవలా రారాణిగా అలరారిన యద్దనపూడి సులోచనారాణికి ఈయన స్వయంగా మనవడు కావడం విశేషం. ‘ఓ పిట్టకథ’ ఫేమ్ సంజయ్ రావ్ (ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు), మానస్ నాగులపల్లి హీరోలు. మహేష్ కొమ్ముల, ప్రియాంత్, గౌతమ్ ముఖ్య పాత్రధారులు. అయిదు కథల సమాహారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షత సోనావల, చరిష్మా శ్రీకర్ హీరోయిన్స్. సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణంలో అడవి శేష్ రూపొందిస్తున్న ‘మేజర్’లో  ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్న ప్రదీప్ ‘క్షీర సాగర మథనం’లో విలన్‌గా నటిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ టర్నెడ్ డైరెక్టర్ అనిల్ పంగులూరి మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించి.. తన గురించి.. తన సినిమా ‘క్షీర సాగర మథనం’ గురించి పలు విషయాలు వెల్లడించారు.

హాయ్ అనిల్ గారు.. ముందుగా మీ గురించి చెబుతారా?

మాది ఒంగోలు. అక్కడే బి.ఎస్.సి(కంప్యూటర్స్) వరకు చదువుకుని, ఎం.బి.ఏ వైజాగ్ లోని బుల్లయ్య కాలేజ్‌లో చేశాను. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే సినిమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రఖ్యాత నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి మా అమ్మమ్మగారు కావడంతో చిన్నప్పటి నుంచి సాహిత్యంలోనూ ప్రవేశం ఉండేది. మా తాతగారు పంగులూరి సుబ్బారావుగారు అన్నపూర్ణ పిక్చర్స్‌లో మేనేజర్‌గా పని చేసేవారు. ఇక.. పలువురు ప్రముఖ దర్శకులతో సన్నిహిత సంబంధాలు కలిగి, కొన్ని చిత్రాలకు కథలు అందించిన గౌరీ శంకర్ మా కాలేజీ లెక్చరర్. ఆయన తన కథల గురించి, సినిమాల గురించి నాతో చర్చిస్తూ ఉండేవారు. ఆ విధంగా నాకూ సినిమాల పట్ల ఆసక్తి ఏర్పడింది.

మరి మీ సినిమా ప్రయాణం ఎలా మొదలయింది?

ఎం.బి.ఏ తర్వాత కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి.. ఐ.టీలో నా కెరీర్ స్టార్ట్ చేశాను. కొన్నాళ్ళు.. అమెరికా, స్విట్జర్లాండ్, సౌదీ అరేబియాలోనూ పని చేశాను. నేను రాసిన కథ ఒకటి ‘పిల్ల జమీందార్, భాగమతి’ చిత్రాల దర్శకుడు అశోక్‌కి నచ్చి (అప్పటికింకా ఆయన ఆ చిత్రాలకు దర్శకత్వం వహించలేదు) సినిమాగా తీసేందుకు సన్నాహాలు చేశారు. కానీ కారణాంతరాలవల్ల ఆ ప్రాజెక్ట్ ఆచరణరూపం దాల్చలేదు. అయితే.. అశోక్ దర్వకత్వంలో రూపొంది అనూహ్య విజయం సాధించిన ‘పిల్ల జమీందార్, సుకుమారుడు’ చిత్రాలతోపాటు, నా మిత్రుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో సుమంత్ హీరోగా రూపొందిన ‘ఇదం జగత్’ చిత్రాల రూపకల్పనను చాలా దగ్గర నుంచి పరిశీలించి.. సినిమా మేకింగ్ పై కొంతమేర అవగాహన కలిగించుకున్నాను. అలాగే మరింత లోతైన అవగాహన కోసం కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశాను. ‘ఇదం జగత్’కి నా పేరు ‘స్క్రిప్ట్ అసోసియేట్’ అని కూడా పడుతుంది.

‘క్షీర సాగర మథనం’ ఎలా శ్రీకారం చుట్టుకుంది?

ఉద్యోగరీత్యా ఉన్నత స్థానంలో ఉన్న నేను.. వేరే నిర్మాతలను కలవడం కోసం.. అదేపనిగా తిరిగేందుకు తగిన టైమ్ కేటాయించలేని పరిస్థితుల్లో.. నేనే స్వయంగా దర్శకత్వం, నిర్మాణం చేపట్టాను. అప్పటికే నేను నా కథను కనీసం ఓ వంద మందికి చెప్పాను. వాళ్ళల్లో ఏ ఒక్కరూ కథ బాలేదని చెప్పలేదు. దాంతో ఎవరి చుట్టో తిరగడం ఎందుకని.. నా ఫ్రెండ్స్‌తో కలిసి ‘క్షీర సాగర మథనం’ చిత్రానికి శ్రీకారం చుట్టాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు ప్రఖ్యాత ఐ.టి కంపెనీల్లో పని చేస్తున్న నా మిత్రులు ఓ 20 మంది ఈ చిత్ర నిర్మాణం వెనుక ఉన్నారని చెప్పడానికి గర్వపడతాను.

క్లుప్తంగా కథ ఏంటో చెబుతారా?

ఇందులో అయిదు కథలు ఉంటాయి. ఐదూ సమాంతరంగా సాగుతూ ఉంటాయి. ‘వేదం, చందమామ కథలు’ చిత్రాల తరహాలో ఉంటుంది. ఆ చిత్రాల్లో లేని థ్రిల్లింగ్ ఎలిమెంట్ ‘క్షీర సాగర మథనం’లో ఉంటుంది. తెలుగు తెరపై ఇంతవరకు ఈ తరహా చిత్రం ఇదే మొదటిసారి అని చెప్పగలను. ఈ జోనర్‌ను ‘ఆంథోలజీ విత్ థ్రిల్లర్’ అని చెప్పొచ్చు. టాలీవుడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.

సినిమాను ఎన్ని రోజుల్లో, ఎక్కడెక్కడ తీశారు?

41 రోజుల్లో.. హైదరాబాద్, వికారాబాద్‌లోని సుమారు 40 లొకేషన్స్‌లో తీశాం.

చిత్ర రూపకల్పనలో మీకేమైనా చేదు అనుభవాలు ఎదురయ్యాయా?

చెప్పుకోదగ్గవేమీ లేవనే చెప్పాలి. షూటింగ్ మొదలు పెట్టిన రెండు రోజులు మాత్రం కాస్త గాభరా పడ్డాను. చాలా దూబరా అవుతోందనిపించింది. దాంతో నిరవధికంగా షూటింగ్ ఆపేసి.. వృధాకి ఆస్కారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని... అప్పుడు మళ్ళీ షూట్ స్టార్ట్ చేశాం. అది తప్ప షూటింగ్ అంతా స్మూత్‌గా సాగిపోయింది. ఇందులో ముఖ్య నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ నా మీద, నా కథ మీద నమ్మకంతో పనిచేసినవాళ్ళే. కాబట్టి అందరూ బాగా కోపరేట్ చేశారు. ముఖ్యంగా షూట్ కి వెళ్ళడానికి ముందు చాలా రోజులు మా ఆర్టిస్టులతో వర్క్ షాప్స్ చేశాం. అందువల్ల కూడా షూటింగ్ సజావుగా సాగిపోయింది.

సాంకేతిక నిపుణుల గురించి చెబుతారా?

‘హవా, అమృతారామం’ చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన సంతోష్ మా చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఇప్పుడు విజయేంద్రప్రసాద్ గారి సినిమాకి పని చేస్తున్నాడు. రాజమౌళి ప్రశంసలు అందుకున్న... వంశీ అట్లూరి మా సినిమాకి ఎడిటర్. అజయ్ ఆరసాడ మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. శ్రీమణి, వశిష్ట్ శర్మ సాహిత్యం అందించారు. కీరవాణి గారబ్బాయి కాలభైరవ, అనురాగ్ కులకర్ణి వంటివారు పాటలు పాడారు.

దర్శకుడిగా మీకు ప్రేరణ ఎవరు?

చాలా మంది ఉన్నారు. మంచి సినిమాలు తీసినవాళ్లంతా నాకు గురువులే. అయితే.. ప్రత్యేకంగా చెప్పాలంటే మాత్రం క్రిష్, సుకుమార్, రాజమౌళి నాకు రోల్ మోడల్స్ అని చెబుతాను.

మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు?

చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అందరికీ నచ్చే చిత్రమిది. అందరూ కచ్చితంగా కనెక్ట్ అవుతారు. కాబట్టి ఆరేళ్ళ నుంచి అరవై ఏళ్ల వరకు అందరికీ నచ్చే సినిమా.

దర్శకుడిగా మీకు ఎటువంటి పేరు వస్తుందని భావిస్తున్నారు?

నా పేరు మరీ మారుమ్రోగిపోతుందని చెప్పను కానీ.. మన తెలుగు ఇండస్ట్రీకి ‘మరో మంచి దర్శకుడు దొరికాడు’ అనే ప్రశంసలైతే వస్తాయి. నా తదుపరి చిత్రానికి సూటయ్యే హీరోని పెద్దగా కష్టపడకుండానే కలిసి కథ చెప్పగలుగుతాను. నా మీద నమ్మకంతో ఈ సినిమాకు పెట్టుబడి పెట్టిన 20 మంది మిత్రుల్లో చాలా మంది నిర్మాతలవుతారు. మిగతావాళ్ళు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యం కొనసాగిస్తారు. వాళ్ళు పెట్టిన డబ్బులు ఎక్కడికీ పోవు. వడ్డీతో సహా తిరిగి వస్తాయి.

అంటే మీ నెక్స్ట్ సినిమాకి కూడా సన్నాహాలు చేసుకుంటున్నారా?

అవును. ‘క్షీర సాగర మథనం’తో దర్శకుడిగా నాకు వచ్చే పేరు చెడగొట్టుకోకుండా.. దాన్ని పెంచేలా ఉండేలా మంచి కథ సిద్ధం చేశాను. ‘క్షీర సాగర మథనం’ 25 డేస్ ఫంక్షన్‌లో నా నెక్స్ట్ సినిమా డిటైల్స్ అనౌన్స్ చేస్తాను.

Ksheera Sagara Madhanam Director Anil Panguluri Interview:

Director Anil Panguluri talks about Ksheera Sagara Madhanam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs