‘రాహు’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న నటించిన కృతి గార్గ్ కనిపించడం లేదంటూ చిత్ర దర్శకుడు సుబ్బు వేదుల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించిన వ్యవహారం కలకలం రేపుతోంది. యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సినిమాలో చాన్స్ అంటూ ఆ భామకు ఫోన్ రావడం.. ఆమె ఎగేసుకుని ముంబైకి వెళ్లడం.. మిస్సింగ్ అంటూ పంజాగుట్టులోని పోలీసులకు ఫిర్యాదు చేయడం.. తీరా చూస్తే అది అనంతపురంకు చెందిన వ్యక్తి చేశారని తేలడం.. తీరా కథ మొత్తం ముగిశాక తీరిగ్గా అబ్బే అదేం లేదే.. నేను సేఫ్‌గానే మా ఇంట్లో ఉన్నానని హీరోయిన్ చెప్పడం ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంతకీ ఏం జరిగింది..!?
కృతికి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలకు హీరోయిన్ ఒకింత కంగుతిన్నది. ‘రాహు’ సినిమాలో మీ నటన చాలా అద్భుతంగా ఉంది. మీలాంటి ప్రతిభ కలిగిన హీరోయిన్ దొరకడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి పక్కన హీరోయిన్‌గా మిమ్మల్ని తీసుకుంటున్నారు. మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నాం.. వెంటనే మీరు ముంబైకి రండి’ అన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం. అయితే.. ఆ ఫోన్ కాల్‌లో నిజానిజాలెంత..? అని ఆలోచించకుండానే ఆ భామ హైదరాబాద్ నుంచి ముంబైకి చెక్కేసింది.. తీరా చూస్తే ఫోన్ స్విచాఫ్.. డైరెక్టర్ సుబ్బు పంజాగుట్టలో పోలీసులకు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయింది. ఫిర్యాదులో అసలేం జరిగింది..? ఫోన్ కాల్స్ ఎప్పట్నుంచి వస్తున్నాయ్..? అనే విషయాలు నిశితంగా పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించి మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అబ్బే అదేం లేదే..!
ఫోన్ కాల్ రావడంతో ముంబైకి వెళ్లడం.. ఆమె ఫోన్ కనెక్ట్ కాకపోవడంతో ఏం జరిగి ఉంటుందని సన్నిహితులు, ‘రాహు’ చిత్రం ఆందోళన చెందింది. తీరా చూస్తే.. అదేదో సామెత ఉంది కదా.. అలా అబ్బే అదేం లేదే.. అని చెప్పుకొచ్చింది. ‘నేను ఎక్కడికీ వెళ్లలేదు. ముంబైలోని మా ఇంట్లోనే సేఫ్‌గానే ఉన్నా. నెట్ వర్క్ లేని కారణంగా ఫోన్ కనెక్ట్ కాలేదు. ఫోన్ పనిచేయకపోవడంతో డైరెక్టర్ సుబ్బు ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసుంటాడు. ఇలాంటి పరిస్థితి తలెత్తినందుకు క్షమించండి. నా పట్ల ఇంతటి శ్రద్ధ చూపినందుకు అందరికీ ధన్యవాదాలు’ అని కృతి గార్గ్ వీడియోలో చెప్పుకొచ్చింది.
మీకే తెలియాలి!
అయితే అంతా అయిపోయిన తర్వాత ఇలా చేయడమేంటి..? ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే.. సినిమా ప్రమోషన్ కోసమే చేస్తున్నారని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే.. ఇదివరకు ఇలానే చాలా సినిమాలకు డైరెక్టర్స్ చీప్ ట్రిక్స్ ప్లే చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఒకవేళ ఇది నిజంగా జరిగినా జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. కృషి విషయంలో కూడా అలానే జరిగి ఉండదనే నమ్మకాల్లేవ్.. నిజానిజాలేంటో డైరెక్టర్‌కు.. కృతికి మాత్రమే తెలియాలి మరి.