టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా విజయంతో ఫుల్ జోష్ మీదున్నాడు. మహర్షి సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయిన తర్వాత వచ్చిన చిత్రం కూడా అదే రేంజ్ లో వసూళ్ళు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సరిలేరు తర్వాత మహేష్ వంశీపైడిపల్లితో సినిమా చేస్తానని చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ సినిమా క్యాన్సిల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. వంశీ చెప్పిన లైన్ కి ఓకే అన్న మహేష్ పూర్తి కథతో సంతృప్తి పడలేదని తెలిసింది.
వంశీని కాదన్నాక లైన్లోకి పరశురామ్ వచ్చాడని పుకార్లు చెలరేగాయి. గీతగోవిందం సినిమాతో తానేంటో నిరూపించుకున్న పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటించబోతున్నాడని, ఈ సినిమాని గీతా ఆర్ట్స్ నిర్మిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ వీటిపై ఎలాంటి స్పష్టత రాలేదు. మహేష్ తర్వాతి సినిమాకి దర్శకుడు ఎవరన్న విషయం పక్కన పెడితే, ప్రస్తుతం మహేష్ ఒక ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నాడట.
సమాజానికి మెసేజ్ ఇచ్చే స్క్రిప్టులకి బదులు జనాలని ఒక మంచి ఫీల్ తో ఎంటర్ టైన్ చేసే సినిమాని చేయాలని భావిస్తున్నాడట. సింపుల్ గా చెప్పాలంటే అతడు లాంటి ఎంటర్ టైనర్ చేయాలని ఉందట. ఒకే మూసలో సినిమాలు చేయడం వల్ల భవిష్యత్తులో తన కెరీర్ కి ఆటంకం కలగవచ్చని అనుకుంటున్నాడట. అందుకే ఈ సారి సోషల్ మెసేజ్ లు లాంటివి లేకుండా వినోదాన్ని అందించే సినిమాని ఇవ్వాలని రెడీ అవుతున్నాడు.