జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా యస్.యస్. రాజమౌళి రూపొందిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. చందమామ కథ లాంటి బాహుబలి సినిమాతో ప్రపంచాన్ని మెస్మరైజ్ చేసిన ఆయన ఈసారి ఎలాంటి సినిమాని చూపిస్తాడోనని వాళ్లంతా తహతహలాడుతున్నారు. టాలీవుడ్‌లోని ఇద్దరు టాప్ హీరోలతో పాటు, అజయ్ దేవగణ్, అలియా భట్ లాంటి టాప్ బాలీవుడ్ తారలు, బ్రిటిష్ నటీనటులు, హాలీవుడ్ టెక్నీషియన్లు.. ఇలా ఏ రకంగా చూసినా భారీతనమే కనిపిస్తుండటంతో.. ఆర్ఆర్ఆర్ బడ్జెట్ ఊహించిన దానికి మించి ఆకాశాన్ని అంటుతోందని సమాచారం. రాజమౌళి అంటేనే భారీతనం అనే విషయం తెలిసిందే. షూటింగ్‌లో జాప్యం కారణంగా బడెజ్ట్ పరిమితులు దాటిపోతున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాకోసం చాలా కాలం వెచ్చించాల్సి రావడం, ఎక్కువ కాల్షీట్లు ఇవ్వాల్సి రావడంతో జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌లకు ఎక్కువ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత డీవీవీ దానయ్య ఇదివరకే అంగీకరించారు. అయితే ఇప్పుడు ఆ పారితోషికాన్ని తగ్గించుకోవాలంటూ వాళ్లను కోరుతున్నట్లు తెలిసింది. ‘‘ఇద్దరు హీరోలు తమ రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారు. అజయ్ దేవగణ్ అయితే ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోకుండా పనిచేస్తున్నారు. అలియా భట్ సైతం చాలా తక్కువ రెమ్యూనరేషన్‌కే చేస్తోంది. ఈ విషయంలో దర్శక నిర్మాతలకు అందరూ సహకరిస్తున్నారు’’ అని రాజమౌళి సన్నిహిత వర్గాలు తెలిపాయి.
మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీతో తన రికార్డుల్ని తనే బద్దలు కొట్టే దిశగా రాజమౌళి అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్ పరంగా బాహుబలి రికార్డుల్ని బద్దలు కొట్టేసింది. ఒక్క ఇండియాలోనే ఈ మూవీపై రూ. 400 కోట్లకు పైగా బయ్యర్లు వెచ్చిస్తున్నారు. ఓవర్సీస్‌లో రూ. 70 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఎం.ఎం. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ 2021 జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానున్నది.