చాలా గ్యాప్ తర్వాత నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ లోకి వచ్చిన దర్శకుడు తేజ ప్రస్తుతం రెండు సినిమాల పేర్లని ప్రకటించి ఆసక్తి రేపాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా విజయాన్ని అందుకున్న తేజ.. ఆ తర్వాత ఆ ప్రయాణాన్ని కొనసాగించలేకపోయాడు. కాజల్ హీరోయిన్ గా వచ్చిన సీత సినిమా బాక్సాఫీసు వద్ద చతికిల పడింది. సీత పరాజయం తర్వాత తేజ నుండి ఎలాంటి అప్డేట్ రాలేదు.
మధ్యలో ఉదయ్ కిరణ్ బయోపిక్ గురించిన వార్తలు వచ్చినప్పటికీ..ఆ వార్తల్లో నిజం లేదని తెలిసిపోయింది. అయితే ప్రస్తుతం తేజ నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. అలివేలుమంగ వెంకట రమణ, రాక్షస రాజు రావణాసురుడు అనే రెండు సినిమాలు తేజ దర్శకత్వంలో తెరకెక్కుతాయని సమాచారం. ఈ రెండు సినిమాల్లో హీరోలు ఎవరనేది ఇంకా ఫిక్స్ కాలేదు. అనధికార సమాచారం ప్రకారం అలివేలుమంగ వెంకట రమణ కథకి గోపీచంద్ చక్కగా సరిపోతాడని భావిస్తున్నారు.
ఇంకా హీరో ఎవరో ఫిక్స్ కాని ఈ సినిమాలో హీరోయిన్లు మాత్రం ఫిక్స్ అవుతున్నారు. మొదట కాజల్ హీరోయిన్ గా నటిస్తుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ కూడా నటిస్తుందట. అయితే కాజల్ స్థానంలో కీర్తిని తీసుకున్నారా లేదా కీర్తిని మరో హీరోయిన్ గా తీసుకున్నారా అనే విషయం మాత్రం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇకపోతే రాక్షస రాజు రావణాసురుడు సినిమాలో రానా నటిస్తాడని వార్తలు వస్తున్నాయి.