నాలుగు రోజుల క్రితం భారతీయుడు 2 సెట్స్ లో జరిగిన క్రెయిన్ ప్రమాదంలో ముగ్గురు మరణించడం పలువురు గాయపడడం సంచలనం అయ్యిన విషయం తెలిసిందే. అయితే కమల్ హాసన్ చనిపోయిన వారికి కోటి రూపాయల ఆర్ధిక సహాయం చేసాడు. ఇక అప్పటి నుండి కామ్ గా ఉన్న దర్శకుడు శంకర్ తాజాగా చేసిన ట్వీట్ గుండెలని పిండేసినట్లుగా అయ్యింది. నా అసిస్టెంట్స్ చనిపోవడం చాలా బాధాకరం. ఆ క్రెయిన్ నా మీద పడి నేను ప్రాణాలు కోల్పోయినా బావుండేదంటూ చేసిన ట్వీట్ కి అందరూ బాధతో మీరు మాత్రం ఏం చేస్తారు. మీకు దెబ్బలు తగిలాయి త్వరగా కోలుకోండి అంటూ ఆయనకి రిప్లై ఇస్తున్నారు. అయితే కమల్ హాసన్ భారతీయుడు నిర్మాణ సంస్థ లైకా వారికి బహిరంగ లేఖ రాసాడు. అదేమంటే గాయపడిన వారికి చనిపోయిన వారికి ఎక్స్‌గ్రేషియాతో పాటుగా అక్కడ పని చేస్తున్న వర్కర్స్ కి భీమా ఏర్పాటు చెయ్యాలని లేదంటే భారతీయుడు షూటింగ్ లో పాల్గొనని లేఖ రాసాడు.
అయితే లైకా వారు కమల్ లేఖకు ప్రతి లేఖను రాసారు. ‘‘కమల్ హాసన్ గారు మీరు అడగకముందే మేము అన్ని చేసాము. మృతుల కుటుంబాలకు 2 కోట్ల ఎస్ గ్రేషియా ప్రకటించాము. గాయపడిన వాళ్ళకి చికిత్స అందించడం కాదు.. అనునిత్యం వాళ్లకి అందుబాటులో ఉంటున్నాం. ఆ ఘటన దురదృష్టకరం, మేము ప్రమాదం జరిగినప్పటి నుండే సకాలంలో స్పందించాము. అది మీ దృష్టికి రాకపోవడం దురదృష్టకరం. ఇక ప్రమాదాలు జరక్కుండా షూటింగ్ సమయంలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేస్తున్నాం. ఆ ఘటన జరిగినప్పుడు మీరు అక్కడే ఉన్నారన్న సంగతి ప్రత్యేకించి గుర్తు చెయ్యక్కర్లేదు. బాధితులకు భీమా సమకాలంలో అందేలా ఏర్పాట్లు చెయ్యడమే కాదు. వారిని అన్ని రకాలుగా ఆదుకుంటాం. మీరు లేఖ రాయకముందే మేము మీరు అడిగినవి పూర్తి చేసాం. ఇక మీరు షూటింగ్ ని పునః ప్రారంభిస్తే బావుంటుంది’’ అని లైకా ప్రొడక్షన్స్ కమల్ హాసన్ కి బహిరంగ లేఖ రాసింది.