ప్రభాస్ తర్వాతి చిత్రం గురించి ఎన్నో ఊహాగానాలు, ఎన్నో పుకార్లు సొషల్ మీడియా వేదికను షేక్ చేశాయి. రాధాక్రిష్ణ దర్శకత్వంలో జాన్ అనే సినిమా తెరకెక్కుతున్న సమయంలో ప్రభాస్ తర్వాతి సినిమా గురించి ప్రతిరోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఏ దర్శకుడు ఖాళీగా కనబడ్డ ఆ దర్శకుడితో ప్రభాస్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగాతో సినిమా ఉంటుందని, మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ తో సినిమా ఉంటుందని పుకార్లు బయలుదేరాయి.
అయితే ఈ రెండు పుకార్లలో ఒకటి నిజం కాబోతుంది. మహానటి సినిమా ద్వారా తనను తాను నిరూపించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ తో ప్రభాస్ సినిమా ఉండనుందని ఈ రోజు ప్రకటించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకుడిగా ఈ సినిమా ఉండనుందట. తెలుగులో ఎన్నో పెద్ద పెద్ద చిత్రాలని నిర్మించిన వైజయంతీ మూవీస్ ఇప్పుడు ప్రభాస్ తో సినిమా తీసేందుకు సిద్ధమైంది.
ప్రభాస్ తో సినిమా అంటే అది ఖచ్చితంగా పాన్ ఇండియా చిత్రమే అయి ఉంటుంది. మహానటితో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నాగ్ అశ్విన్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడంటే దానిలో ఏదో ప్రత్యేకత ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ చేయని జోనర్ అయిన సైన్స్ ఫిక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉంటుందని సమాచారం.