ఓటమెరుగని దర్శకధీరుడు రాజమౌళి అలియాస్ జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాలో స్టార్ హీరోలుగా వెలుగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు.. రానున్న జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా జక్కన్న ప్రకటించేశారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ఈ కుర్ర హీరోల ముందు ఇన్నిరోజులుగా ‘వాట్ నెక్స్ట్’ అనే ప్రశ్నలు మెదిలాయి. అయితే.. ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడని అధికారికంగానే ప్రకటన వచ్చేసింది.. ఇక మిగిలిందల్లా రామ్ చరణ్ మాత్రమే. ఆయన కూడా రీమేక్‌ల మీద కన్నేశారని.. ఒకరిద్దరు డైరెక్టర్స్ కూడా ఆయన కోసం కథలు సిద్ధం చేశారని వార్తలు గుప్పుమన్నాయ్.. అయితే అవన్నీ పుకార్లేనట. తాజాగా.. చెర్రీ ఓ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడనే ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగు చూసింది.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు.. ‘13బి’, ‘మనం’, ‘హలో’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ కె.కుమార్. ఈ మధ్యే షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన చెర్రీని కలిసి కథ వినిపించాడట. ఇదివరకూ డైరెక్టర్లు వినిపించిన కథ కంటే ఎక్స్‌ట్రాడినరీగా ఉండటంతో.. ‘సూపర్బ్ విక్రమ్.. మనం సినిమా చేద్దాం’ అని మాటిచ్చారట. ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయ్యేలోపు కథ పూర్తిగా సిద్ధం చేసుకోవాలని సూచించారట.
కాగా.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందనేది టాక్ నడుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వీలైనంత త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని టాలీవుడ్‌లో ఈ వార్త కోడై కూస్తోంది. అయితే.. ఈ మధ్య విక్రమ్‌కు కాలం కలిసిరావట్లేదు.. తెరకెక్కించిన సినిమాలన్నీ అట్టర్ ప్లాప్ అవుతున్నాయ్.. చెర్రీతో సినిమా నిజమైతే అదైనా ఆయనకు కలిసొస్తుందో లేదో..! తానేంటో నిరూపించుకోవాల్సిన సరైన సమయం విక్రమ్‌కు ఆసన్నమైందని మాత్రం చెప్పుకోవచ్చు.