టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. ఇందులో పవన్ సరసన ఎవరెవరు నటిస్తున్నారు..? ఎవరెవర్ని తీసుకున్నారు..? షూటింగ్ ఎంతవరకూ వచ్చింది..? అనే విషయాలు బయటికి రావట్లేదు కానీ పుకార్లు మాత్రం పెద్ద ఎత్తునే షికారు చేస్తున్నాయి. అయితే.. ఇది రీమేక్ సినిమా కావడంతో ఈ మధ్య ఆ తరహా సినిమాలన్నీ ఆశించినంతగా ఆడకపోవడంతో పరిస్థి ఎలా ఉంటుందో..? అని అటు పవన్.. ఇటు.. సూపర్ హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఆలోచనలో పడ్డారట.
వాస్తవానికి తమిళంలో భారీ హిట్ అందుకున్న ‘96’ చిత్రం.. తెలుగులో ‘జాను’ బాక్సాఫీస్ దగ్గర అస్సలు నిలబడలేకపోయింది. ఇప్పటికే ఒరిజనల్ సినిమా జనాలంతా చూసేయడం.. కొన్ని కొన్ని సన్నివేశాలు బాగా హార్ట్ టచింగ్‌గా ఉండటంతో మళ్లీ మళ్లీ చూసేశారు. దీంతో రీమేక్‌ను చూడటానికి తెలుగు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. అంతేకాదు.. ఈ సినిమా దెబ్బతో బహుశా ఇక రీమేక్‌ల జోలికి దిల్ రాజు పోడేమో. ఎలాగో ప్రస్తుతం ‘పింక్’ చేస్తున్నాం గనుక.. ఇది పూర్తవ్వగానే ఇక వాటి జోలికే పోకూడదని మైండ్‌లో బ్లైండ్‌గా ఫిక్సయ్యాడట. అయితే పవన్ రీమేక్ విషయంలో మాత్రం బాగా ధైర్యంగానే దిల్ రాజు ఉన్నారట.
అదెలాగంటే.. పవర్ స్టార్‌కు ప్రపంచం మొత్తం ఫ్యాన్స్ ఉండటం.. వాళ్లంతా సినిమాను చూసి ఆదరించకపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల అభిమానులు మాత్రం చూసేస్తే తన పంట పండినట్లేనని భావిస్తున్నాడట. ‘జాను’ విషయంలో అనుకున్నది జరగకపోయినప్పటికీ.. పవన్ విషయంలో ఫ్యాన్ మానియా కచ్చితంగా వర్కవుట్ అవుతుందని.. అది కూడా రీ ఎంట్రీ మూవీ కావడంతో రెండు మూడ్రోజుల్లోనే తాను ఖర్చు పెట్టిన డబ్బులొచ్చేస్తాయని కూడా రాజుగారు లెక్కలేసుకుని మరీ కూర్చున్నారట. మరి దిల్‌రాజు నమ్మకాన్ని పవన్ ఫ్యాన్స్ నిలబెడతారో లేదో.. అయితే కంటెంట్ ఉన్నోడి సినిమా ఏ రేంజ్‌లో దూసుకెళ్లి బాక్సాఫీస్‌ను సైతం షేక్ చేస్తుందో ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు!.