అవును మీరు వింటున్నది నిజమే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండ్రోజుల పర్యటన నిమిత్తం సకుటుంబ సమేతంగా ఇండియాకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం సందర్శించి.. ఇండియాలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన మొతెరా స్టేడియం వేదికగా కీలక ప్రసంగం చేశారు. అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్ అందాలను వీక్షించి ఫిదా అయిపోయారు. అయితే ఆయన పర్యటనలో భాగంగా చేసిన ఓ చర్యకు.. అందరూ నందమూరి బాలకృష్ణను గుర్తు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ట్రంప్-బాలయ్యల గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. ఇంతకీ ట్రంప్‌కు.. బాలయ్యకు సంబంధమేంటి..? ఏ విషయంలో వీరిద్దరికీ పోలిక ఉంది..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
భారత్ పర్యటనలో భాగంగా సబర్మతీ ఆశ్రమాన్ని ట్రంప్ అండ్ ఫ్యామిలీ సందర్శించిన అనంతరం.. తాజ్‌మహల్‌ను సందర్శించిన తర్వాత తన అనుభవాలను ఎంట్రీ బుక్‌లో ట్రంప్ రాశారు. మొదట సబర్మతీ ఆశ్రమంలో ‘ఈ అద్భతమైన అవకాశం కల్పించినందుకు నా గొప్ప మిత్రుడు నరేంద్ర మోదీ ధన్యవాదాలు’ అని పుస్తకంలో రాశారు. అనంతరం కింది భాగాన సంతకం పెట్టి.. అమెరికా అధ్యక్షుడు అని రాశారు. ఈ సంతకంను చూసిన జనాలకు రెండు గుర్తుకొచ్చాయ్.. అదేమిటంటే ఒకటి ‘ఈసీజీ’ టెస్ట్ కాగా.. రెండోది నందమూరి బాలయ్య సంతకం.!
వాస్తవానికి బాలయ్య సంతకం.. ట్రంప్ సంతకాన్ని పోల్చి చూస్తే.. వీరిద్దరి సంతకాన్ని వేరెవ్వరూ కాపీ కొట్టలేరు.. ఫోర్జరీ చేయడానికి వీల్లేదు. ఒకింత అటు ఇటు ఇద్దరి సంతకాలు ఒకే రీతిలో ఉంటాయని.. బాబోయ్.. వరల్డ్ వైడ్‌గా ట్రంప్.. మన ఇండియాలో, ఏపీలో బాలయ్య అంటూ నెటిజన్లు, విమర్శకులు నెట్టింట్లో హడావుడి చేస్తున్నారు. వీరిద్దరి సంతకాలున్న ఫొటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సో.. ట్రంప్ ఇండియా రాకతో బాలయ్య ఈ విధంగా హాట్ టాపిక్ అయ్యారన్న మాట.