జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించనున్న 30వ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని సమాచారం. ఇప్పటికే మెయిన్ హీరోయిన్ గా రష్మిక ఎంపికైందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై రష్మిక పెదవి విప్పడం లేదు. ఇటీవల ‘భీష్మ’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో జరిగిన ఇంటరాక్షన్ సందర్భంగా ఆమెను ఈ ప్రశ్న అడిగినప్పుడు దాని గురించి ఇప్పుడేమీ చెప్పలేనని తెలిపింది. అంటే ఆ సినిమాకు ఆమెను సంప్రదించారా, లేదా అనే విషయాన్నీ ఆమె బయటపెట్టలేదు. ఇటీవల ‘భీష్మ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్ సపోర్ట్ కావాలని ఆమె బహిరంగంగా తెలిపింది. దాంతో ఆయనను ఆమె కాకా పడుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి.
మరోవైపు పూజా హెగ్డే పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ‘అల.. వైకుంఠపురములో’ మూవీకి పూజ ఎంత ప్లస్ అయ్యిందో మనకు తెలుసు. అల్లు అర్జున్ జోడీగా ఆమె పర్ఫెక్ట్ అనిపించుకుంది. పైగా ఇప్పటికే ‘అరవింద సమేత’లో తారక్ సరసన నటించి మెప్పించింది కూడా. సందర్భవశాత్తూ ఆ మూవీ డైరెక్టర్ కూడా త్రివిక్రమ్. దీంతో తారక్ ౩౦వ మూవీలోనూ ఆమె హీరోయిన్ గా నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఒక వర్గం భావిస్తోంది. త్రివిక్రమ్ కూడా ఆమె వైపే మొగ్గు చూపుతున్నాడని అంటున్నారు. కానీ తారక్ మాత్రం మెయిన్ హీరోయిన్ గా ఫ్రెష్ ఫేస్‌ను కోరుకుంటున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు రష్మికతో ఆయన నటించలేదు. అందువల్ల రష్మిక అయితే బాగుంటుందని ఆయన భావిస్తున్నాడు.
కాగా సినిమాలో మరో హీరోయిన్ రోల్ కూడా ఉందనీ, దానికి సమంత పేరు పరిశీలనలో ఉందనీ తెలుస్తోంది. ఇప్పటికే తారక్, సమంత కలిసి నాలుగు సినిమాలు - ‘బృందావనం, రామయ్యా వస్తావయ్యా, రభస, జనతా గ్యారేజ్’.. చేశారు. అది పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ అనీ, దానికి సమంత అయితే న్యాయం చేస్తుందనీ త్రివిక్రమ్ భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆమె సైతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘అ ఆ’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్బస్టర్ మూవీస్ చేసింది. ఆ రోల్ కు సమంతను తీసుకొనే విషయంలో తారక్ కు ఎలాంటి అభ్యంతరం లేదని సమాచారం. ఇప్పటివరకైతే సమంత, రష్మిక వైపే త్రాసు మొగ్గుతోంది. రానున్న రోజుల్లో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటాయామో చూడాలి.