టాలీవుడ్ పవర్‌స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘పింక్’ రీమేక్ ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాలో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణలో ఆయన బిజిబిజీగా ఉన్నారు. పవన్ షూటింగ్‌లో ఉండగా ఓ పిక్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేసింది. అయితే అదే దాదాపు ఫస్ట్ లుక్ అని ఫ్యాన్స్ అనుకున్నారు.. పెద్ద ఎత్తున షేర్‌ల వర్షం కురిపించారు. అయితే అది లీక్ అయిన ఫొటో అని ఆ తర్వాత తెలిసింది. అయితే ఆ మధ్య సినిమా రిలీజ్, ఫస్ట్ లుక్ గురించి నిర్మాత దిల్‌రాజు అధికారికంగా ప్రకటన చేశారు. సినిమా ఎంతవరకూ వచ్చింది..!? షూటింగ్‌లో పవన్ ఉన్నాడా లేడా..? హీరోయిన్ సంగతేంటి..? పవన్ గ్యాప్ ఇచ్చాడా..? లేక రెగ్యులర్ చేస్తున్నాడా..? అనేదానిపై తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ అప్డేడ్ వెలుగులోకి వచ్చింది.
ఆ మధ్య అనగా.. పవన్ కర్నూలు పర్యటనకు ముందు షూటింగ్‌లో పాల్గొన్న ఆయన ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు. ఆ తర్వాత అమరావతి రైతులకు సంఘీభావం, ఢిల్లీ పర్యటనలతో రాజకీయంగా బిజిబిజీగా గడుపుతున్నాడు. సినిమా ఇప్పటికే పవన్‌కు సంబంధించి షూటింగ్ దాదాపు అయిపోయిందట. ఇక గట్టిగా వారం లేదా పదిరోజులు మాత్రమే ‘పింక్’ రీమేక్ జరగనుందట. ఈ పదిరోజులతో పవన్‌కు సంబంధించి అన్ని సన్నివేశాలు పూర్తవుతాయట. వాస్తవానికి ఆ పదిరోజులు ఇదివరకే అయిపోవాల్సినప్పటికీ పవన్ అటు రాజకీయాలతో బిజిబిజీగా ఉండటంతో పోస్ట్ పోన్ అయ్యింది.
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న పవన్ సోమవారం నుంచి మళ్లీ సెట్స్‌కు వస్తారట. ఆయన వచ్చీరాగానే కోర్టు హాల్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో పవన్‌తో పాటు నివేదా కూడా పాల్గొంటుందని తెలుస్తోంది. వీలైనంత త్వరగానే షూటింగ్ పూర్తి చేస్తానని డైరెక్టర్ వేణు శ్రీరామ్.. పవన్‌కు మాటిచ్చారట. ఇక్కడ పూర్తవ్వగానే క్రిష్ మూవీ సెట్‌లో పవన్ ప్రత్యక్షమవుతారట. ఇదిలా ఉంటే.. ఉగాది కానుకగా చిత్ర ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసి.. ఆ తర్వాత సినిమా టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారట. ముందుగా అనుకున్నట్లే మే-15న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడానికి దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నాడు.