గత కొన్ని రోజులుగా రవితేజకి హిట్ అనేది అందని ద్రాక్షే అయింది రాజా ది గ్రేట్ సినిమా తర్వాత్ర రవితేజ చేసిన సినిమాలన్ని ఒకదాన్ని మించి మరోటి ఫ్లాప్ అయ్యాయి. మొన్నటికి మొన్న విలక్షణ సినిమాల్ని తెరకెక్కించిన దర్శకుడు వీ ఐ ఆనంద్ తో తెరకెక్కించిన డిస్కోరాజా కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో రవితేజ మార్కెట్ చాలా వరకు దెబ్బతింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ మరో కొత్త సినిమాతో మన ముందుకు వస్తున్నాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా థమన్ సంగీత సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు మహాశివరాత్రి పర్వదినాన ఈ సినిమా టీజర్ ని రీలీజ్ చేశారు. టీజర్ చూస్తుంటే ఆద్యంతం పక్కా కమర్షియల్ సినిమా అని క్లియర్ గా అర్థం అవుతుంది. రవితేజ నుండి జనాలు ఎక్స్ పెక్ట్ చేసేది మాస్ సినిమాలే... కాబట్టి విలక్షణం పేరు చెప్పి డిఫరెంట్ జోనర్ కి వెళ్ళకుండా మాస్ సినిమాతోనే వస్తున్నారు.
సినిమా ఎంత మాస్ గా ఉన్నా కథనంలో కొత్తదనం లేకపోతే జనాలు సినిమాలు చూడట్లేదు. రొటీన్ రొడ్డకొట్టుడు కథల్ని పక్కన పడేస్తున్నారు. మరి క్రాక్ సినిమా రొటీన్ కి భిన్నంగా ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న శ్రుతి హాసన్ కి కూడా ఈ సినిమా హిట్ అవడం చాలా ఇంపార్టెంట్. చాలా రోజులుగా శ్రుతి తెలుగు సినిమాల్లో కనిపించలేదు. మరి రవితేజ క్రాక్ సినిమా హిట్ అయ్యి మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడా లేదా చూడాలి. వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్రఖని లు నటీనటులుగా నటిస్తున్న ఈ సినిమా మే 8వ తేదీన విడుదల అవనుంది.