Advertisement
Google Ads BL

సూపర్ స్టార్ ఆవిష్కరించిన విజయనిర్మల విగ్రహం


విజయనిర్మల కాంస్యవిగ్రహాన్నిఆవిష్కరించిన సూప‌ర్ స్టార్ కృష్ణ.

Advertisement
CJ Advs

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ ఆఫ్‌ రికార్డ్ గ్ర‌హీత, క‌ళావాహిని శ్రీమ‌తి విజయనిర్మల 74వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా లోని సూప‌ర్ స్టార్‌ కృష్ణ విజయ నిర్మల నివాసంలో ఏర్పాటు చేసిన విజయనిర్మల  కాంస్య విగ్రహాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ ఆవిష్కరించారు. తెలంగాణ‌ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో విజయ నిర్మల స్త్రీ శక్తి పురస్కారాన్ని డైరెక్టర్ నందినిరెడ్డికి  కృష్ణంరాజు, మహేష్ బాబు అందచేశారు. ఈ సంద‌ర్భంగా...

రెబెల్ స్టార్ కృష్ణంరాజు  మాట్లాడుతూ  - ‘‘నాకు బాగా ఇష్టురాలు, స్నేహితురాలు ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే విజయ నిర్మల మనమధ్య లేకపోవడం బాధాకరం. ఆ పేరు లోనే విజయం ఉంది. ఆ పేరులోనే నిర్మలత్వం ఉంది. ఆ విజయం కూడా అనితర సాధ్యం. 46 సినిమాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించి ఎంతో ఎత్తుకి ఎదిగారు. విజయ నిర్మల నాకు బుద్దిమంతుడు సినిమాతో పరిచయం. నేను, కృష్ణ గారు, విజయ నిర్మల క‌లిసి  ఎన్నో సినిమాలు చేశాం. ఆమె సాధించిన విజయాల్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని అటువంటి విజయాల్ని సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి తల్లితండ్రులు అంటే అభిమానం ఉంటుంది.  అలా నరేష్ తన తల్లికి బంగారు పాదాలు చేయించి పూజించడం గొప్ప విషయం’’ అన్నారు.

పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ  - ‘‘విజయ నిర్మల గారు 50 సినిమాలు చెయ్యడం ఒక చరిత్ర. ఈరోజు ఆవిడ వారసత్వాన్ని అద్భుతంగా కొనసాగిస్తున్నారు’’ అన్నారు.

విజయ నిర్మల స్త్రీ శక్తి  అవార్డ్ గ్ర‌హీత, ద‌ర్శ‌కురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ - ‘‘విజ‌య‌నిర్మ‌ల గారి పేరు మీద  విజయ నిర్మల స్త్రీ శక్తి అవార్డు మొద‌టి సంవ‌త్స‌రం నేను  తీసుకోవడం చాలా ఆనందంగా వుంది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ అవార్డు తీసుకోవాలి అని కోరుకుంటున్నాను. మహేష్ చేతుల మీదుగా తీసుకోవడం చాలా హ్యాపీ’’ అన్నారు.

నరేష్ విజ‌య‌కృష్ణ‌ మాట్లాడుతూ : ‘‘ప్రతి తల్లి ఒక అమ్మవారు. అమ్మ దీవెనలు వున్న వారు శిఖరాన్ని అందుకుంటారు. మా అమ్మ కృష్ణ గారి దీవెనలతో ఇద్దరు కలసి ఒక రోల్ మోడల్‌గా నిలిచారు. నాకు ఎప్పుడూ మంచి చెబుతూ ధైర్యం ఇచ్చారు. అమ్మదీవెనలు అందరికీ వుండాలి. మా వెల్ఫేర్ కోసం నేను ఎప్పుడూ ముందు వుంటాను. అమ్మ పేర అవార్డుని నటీ నటులకు ప్రతి సంవత్సరం అందించనున్నాం’’ అన్నారు.

మాజీ ఎంపి మురళి మోహన్ మాట్లాడుతూ - ‘‘అతి సున్నితమైన మనసున్న మన కృష్ణ గారిని విజయనిర్మల దాదాపు 50 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చారు. ఈరోజు ఆవిడ మనమధ్య లేకపోయినా విజయ నిర్మల పుట్టినరోజుని ఇంత ఘనంగా జరపడం నిజంగా అభినందనీయం. ఈ సంవత్సరం లాగే ప్రతి ఏడాది ఆమె పుట్టినరోజు నాడు కళాకారులకు ఆమె పేరు మీద అవార్డ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

ప్రముఖ దర్శకుడు ఎస్వి కృష్ణా రెడ్డి మాట్లాడుతూ - ‘‘కృష్ణ గారితో నెంబర్ వన్ సినిమా చేస్తున్నప్పుడు ఎవ్వరికి దక్కని అదృష్టం నాకు దక్కింది. అదేంటంటే విజయ నిర్మల గారి చేతి వంట తినే అవకాశం. ఆవిడ చూపించిన ప్రేమ, ఆవిడ వంటలో ఆ రుచి ఒకటి కాదు ఆ అనుభూతిని నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఆ అదృష్టం కృష్ణ గారి మూలంగా నాకు దక్కింది. అంతటి ప్రేమానుభూతులు ఉన్నటువంటి విజయ నిర్మల గారు దర్శకత్వ శాఖలో ఉండడం మా అందరికి ఒక అమ్మ ఉన్నట్టుగా అనిపించేది’’ అన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ - ‘‘విజయ నిర్మల గారు నాకు తెలిసి వన్ ఆఫ్ మోస్ట్ గ్రేటెస్ట్ అండ్ డైనమిక్ పర్సనాలిటీ ఎవర్. నా సినిమాలు రిలీజ్ అయినప్పుడు ప్రతి సారి ఫస్ట్ నాన్నగారు మార్నింగ్ షో చూసి నాతో మాట్లాడేవారు. తరువాత విజయనిర్మల గారు మాట్లాడి కంగ్రాట్స్ చెప్పేవారు. సరిలేరు నీకెవ్వరు రిలీజ్ తరువాత నాన్న గారు కంగ్రాచ్యులేట్ చేశారు తరువాత ఆవిడ మాట్లాడబోతుంది అనుకోని వెంటనే రియలైజ్ అయ్యాను. ఆరోజు ఆ లోటు కనిపించింది. ఈరోజు మనందరం ఆవిడను మిస్ అవుతున్నాం. ప్రతిఏటా ఆమె పుట్టినరోజును ఘనంగా నిర్వహించే వాళ్లం. ఈ ఏడాది విగ్రహావిష్కరణతో ఆమెకు మేము ఇస్తున్న చిన్న నివాళి. ఇవ్వాళ ఆవిడ ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉంటారు’’ అన్నారు.

సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ - ‘‘విజయనిర్మల ఐదారు సినిమాలలో నటించినప్పుడే నేను డైరెక్ట్ చేస్తాను అంది. నేను ఒక సలహా ఇచ్చాను. ఇప్పుడే తొందరపడి డైరెక్ట్ చేయనవసరం లేదు ఒక వంద సినిమాలలో నటించి ఆ తర్వాత నువ్వు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అన్నాను. అలాగే వంద సినిమాలు అయిపోయిన తరువాత డైరెక్ట్ చేసింది. మొట్టమొదటి సినిమా బడ్జెట్ తక్కువలో అవుతుందని మలయాళంలో ‘కవిత’ అనే సినిమా చేసింది. అది అద్భుతమైన విజయం సాధించింది. దాని విజయోత్సహంతో తెలుగులో ‘మీనా’ సినిమా తీసింది. అది వందరోజులు ఆడి సూపర్ హిట్ అయింది. ఆ తరువాత వెనక్కి తిరిగి చూడకుండా 46 సినిమాలు తను తీస్తే అందులో 95 శాతం హిట్ సినిమాలే తీసింది. అంత గొప్ప దర్శకురాలు నా భార్య కావడం నా అదృష్టం. ఈరోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. విజయ నిర్మల మీద ఉన్న అభిమానంతో ఈ సభకి విచ్చేసిన  అందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అన్నారు.

ఈ కార్యక్రమంలో నమ్రత, అచ్చిరెడ్డి, రేలంగి న‌ర్సింహా రావు, గల్లా జయదేవ్, పివిపి, సుధీర్ బాబు,  ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Super Star Krishna Inaugurates Vijaya Nirmala Statue:

Vijaya Nirmala Statue Inauguration Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs