‘జబర్దస్త్’ షో ఎంత పాపులర్ అయ్యిందో తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఈ షోకు జడ్జిగా వ్యవహరించిన వాళ్లు మొదలుకుని కంటెస్టెంట్స్, యాంకర్లు అనసూయ, రేష్మి ఇద్దరూ బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదే గుర్తింపుతో వాళ్లు హీరోయిన్లుగా కూడా రాణిస్తున్నారు. అంతేకాదు.. ఇందులోని కంటెస్టెంట్‌లు కూడా సినిమాల్లో ముఖ్యపాత్రలు, హీరోలుగా సినిమాలు చేస్తున్నారంటే ‘జబర్దస్త్’ ఎంత లైఫ్ ఇచ్చిందో ఇంతకంటే చెప్పడానికేమీ లేదు. ఈ షో నుంచి జడ్జ్ నాగబాబు, పలువురు కంటెస్టెంట్లు వెళ్లిపోయినప్పటికీ వన్ అండ్ ఓన్లీ అన్నీ తానై వైసీపీ ఎమ్మెల్యే రోజా నడిపించేస్తున్నారు. అయితే తాజాగా ఓ షాకింగ్ న్యూ్స్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.. అదేమిటంటే.. యాంకర్ అనసూయ షోకు టాటా చెప్పేయనుందట. గత రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి హాట్ యాంకర్ రియాక్ట్ అవ్వకపోవడంతో మౌనానికి అర్థం అంగీకారమేనని తెలుస్తోంది.
వాస్తవానికి.. కంటెస్టెంట్లు కామెడీతో అలరిస్తుంటే.. యాంకర్ అనసూయ మాత్రం హాట్ హాట్ అందాలతో ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుందన్న సంగతి తెలిసిందే. ఇటు నటిమణిగా.. అటు యాంకర్‌గా.. మధ్యలో చిన్న చిన్న పాత్రలు చేయాలంటే అనసూయకు చాలా భారంగా అనిపిస్తోందట. లేనిపోని టెన్షన్స్ అన్నీ నెత్తికెత్తుకోవడం ఎందుకు..? కొన్ని కొన్ని కావాలంటే ఇంకొన్ని వదులుకోవాలన్నట్లుగా జబర్దస్త్‌ను వదులుకోవాడానికి సిద్ధమైందని సమాచారం. తర్వాత ‘జీ తెలుగు’లో రెండు షోలు.. ఇక ఈవెంట్లు, సినిమాలు చేసుకుంటే చాలని ఆమె నిర్ణయించందట. ఈ విషయాన్ని మల్లెమాల యాజమాన్యానికి చెప్పగా వారు పోయేవాళ్లను ఆపడం భావ్యం కాదని మీ ఇష్టమని అనేశారట.
దీంతో అనసూయ లాగా యాంకరింగ్‌లో పండిపోయిన మరొకర్ని.. అందాల యాంకర్‌ను తీసుకురావాలని భావిస్తున్న టైమ్‌లో మంజూష లైన్‌లోకి వచ్చిందట. ప్రస్తుతం ఆమెను స్కిట్‌లలో నటింపజేసి అను దిగిపోగానే.. ఆ సీటులో కూర్చోబెట్టాలని యాజమాన్యం భావిస్తోందట. ఈ మధ్యే మంజూష హైపర్ ఆది స్కిట్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మంజూష కూడా యాంకరింగ్‌లో సీనియరే.. ఈ వ్యవహారంపై మంజూషను మీడియా మిత్రులు అడగ్గా.. ‘నన్నెవరూ సంప్రదించలేదు కానీ.. అవకాశం వస్తే మాత్రం అస్సలు వదులుకోను’ అని అంటోంది. మరి అనసూయ ప్లేస్‌కు న్యాయం చేస్తుందా లేదా..? అసలు ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే అను నుంచి లేదా మల్లెమాల నుంచి క్లారిటీ వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే.