‘సైరా’ సూపర్ హిట్టవ్వడంతో మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ మంచి ఊపు మీదున్నారు. ఇక వరుస సినిమాలు చేస్తూ బిజిబిజీగా గడపాలని మెగాస్టార్ అనుకుంటున్నారు. ఇప్పటికే చిరు-కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా క్లాప్ కొట్టేశారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే కథ, చిరు డబుల్ రోల్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినవచ్చాయి. అదలా ఉంచితే.. మలయాళంలో మోహన్ లాల్ కథానాయకుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన ‘లూసిఫర్’ సినిమా భారీ విజయం దక్కించుకుంది. వివేక్ ఒబెరాయ్ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకకుంది. దీంతో కొరటాల మూవీ కంటే ముందే ఈ సినిమాను తెలుగు రీమేక్ చేయాలని చిరు, చెర్రీ ఫిక్సయ్యారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
అంతేకాదు.. ఈ సినిమాను సురేందర్ రెడ్డి రీమేక్ చేస్తున్నారని కొన్ని రోజులు పుకార్లు రాగా.. ఆ తర్వాత కూడా ఒకరిద్దరు దర్శకుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే తాజాగా డైరెక్టర్ ఫైనల్ అయ్యారట. అంతేకాదు.. ఇందుకు సంబంధించి పూర్తి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందట. ఆ రీమేకర్ మరెవరో కాదండోయ్.. హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ అలియాస్ సుక్కు అట. ఇప్పటికే స్క్రిప్ట్ మొత్తం పూర్తి చేసుకున్న ఆయన.. బన్నీతో సినిమా అయిపోగానే లైన్‌లోకి వస్తారట. అంతలోపు కొరటాలతో చిరు సినిమా కూడా అయిపోతుందని ఆ తర్వాత ఇక ఏ ఇబ్బందీ లేకుండా సజావుగానే సినిమా తెరకెక్కించేయొచ్చని చిరు-సుక్కు అనుకుంటున్నారట. అయితే ఇందులో నిజానిజాలెంతో తెలియాలంటే సినిమా సెట్స్‌పైకి వెళ్లేంతవరకూ వేచి చూడక తప్పదు మరి.