కమెడియన్ అలీ ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు.. కొన్నిరోజుల పాటు సైలెంట్‌గా ఉంటాడు.. ఉండుండి ఒక్క మాట అనేస్తాడు.. అదెంత హాట్ టాపిక్ అవుతుందో.. దాంతో ఎంత మంది నోళ్లలో అలీ నానతాడో..! అలీ నోటి దురుసు ఎక్కువన్న విషయం పలు సందర్భాల్లో నిరూపితమైంది. ఎందుకంటే ఎవరో ఒకర్ని కెలుకుతూ మరీ ముఖ్యంగా లేడీస్‌పై డబుల్ మీనింగ్స్ ఇలా మాట్లాడిన సందర్భాలు ఎన్నో.. ఎన్నెన్నో ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకించి మరీ చెప్పనక్కర్లేదు.. అవన్నీ ఇక్కడ అసందర్భం కూడా. అయితే తాజాగా అలీ ఓ పంచ్ డైలాగ్ పేల్చాడు.. అయితే అది జనసేన అధినేత.. తన బెస్ట్ ఫ్రెండ్ పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించా..? లేకుంటే టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి చేశాడా..? అనేది ఇప్పుడు ఇటు టాలీవుడ్‌లో.. అటు రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో అలీ.. వైసీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీ గెలిచి జగన్ సీఎం అవ్వడంతో తన దశ తిరుగుతుందని అలీ ఎంతగానో ఆశపడ్డాడు కానీ.. ఆయన ఆశలన్నీ అడియాసలే అయ్యాయ్. తనకు ఏదో ఒక పదవి వస్తుందని భావించినప్పటికీ రాకపోగా.. చివరికి అసంతృప్తే మిగిలింది. అలా చాలా రోజుల పాటు రాజకీయంగా మీడియాకు దూరంగా ఉన్న అలీ.. ఇటీవల విశాఖలో పర్యటించాడు.
ఈ సందర్భంగా.. ‘విశాఖ ప్రజలు చాలా మంచివారు.. చాలా ప్రేమ చూపిస్తారు.. కానీ తేడా వస్తే అంతే. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు’ అని పంచ్ డైలాగ్ పేల్చాడు. అయితే విశాఖ జిల్లా గాజువాక నుంచి పోటీ ఘోరంగా ఓడిపోయిన పవన్‌ను ఉద్దేశించి ఆయన ఈ మాటలు అన్నాడా..? లేకుంటే ఏపీ ప్రజలు అనబోయి విశాఖ అని చంద్రబాబును ఉద్దేశించి అన్నాడా అర్థం కాని పరిస్థితి. అయితే అటు వైసీపీ కార్యకర్తలు, అలీ అభిమానులు ‘ఏం సెప్తిరి.. ఏం సెప్తిరి’ మెచ్చుకుంటుండగా.. తాము అభిమానించే పవన్‌ను ఉద్దేశించి అన్నాడేమో అని జనసేనాని ఫ్యాన్స్.. చంద్రబాబును ఉద్దేశించి అన్నాడేమోనని సీబీఎన్ ఫ్యాన్స్ తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఎవర్ని ఉద్దేశించి అన్నాడో అలీకే ఎరుక..!