‘జాను’కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాటలు రావడం లేదు - శర్వానంద్
శర్వానంద్, సమంత అక్కినేని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘జాను’. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సి.ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను ఫిబ్రవరి 7న విడుదల చేశారు.
రామ్ పాత్రకు ఎలా అప్రోచ్ అయ్యారు?
-నాకు దిల్‌రాజుగారి జడ్జ్‌మెంట్ మీద నాకు బాగా నమ్మకం ఉంటుంది. శతమానం భవతి సమయంలోనూ కథ విని కథ బావుంది కానీ.. నా పాత్రకేం లేదు అన్నాను. అప్పుడు కూడా ఆయన నన్ను నమ్ము అన్నారు. ఆయన్ని నమ్మి సినిమా చేశాను. సినిమా పెద్ద హిట్ అయ్యింది. అలా ఆయన జడ్జ్‌మెంట్‌పై నాకు మంచి నమ్మకం ఉంది. దిల్‌రాజు అన్న ‘96’ సినిమా చూడమంటే చూశాను. బాగా నచ్చింది. క్లాసిక్ మూవీ కదా! సినిమా చేద్దామా? అవసరమా? అని ప్రశ్నించాను. దానికి ఆయన ‘లేదు.. నన్ను నమ్ము’ అన్నారు. ఓకే చెప్పిన మూడు నాలుగు నెలల తర్వాతే సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే నేను ఒకసారి మాత్రమే చూశాను. తర్వాత ఎప్పుడూ 96 సినిమాను చూడలేదు. అలాగే పాత్ర కోసం ప్రత్యేకంగా హోం వర్క్ అంటూ ఏమీ చేయలేదు. డైరెక్టర్‌కే వదిలేశాను. ప్రేమ్ ఎలా అంటే.. ఓ సీన్ చేసేముందు దానికి సంబంధించిన బ్యాక్ స్టోరినీ పది నిమిషాల పాటు వివరించేవాడు. రెండు షెడ్యూల్స్ వరకు ఎందుకు ఇలా చేయమంటున్నారో అర్థం కాలేదు. అయితే తర్వాత నా క్యారెక్టర్‌ని ఎంత డెప్త్‌గా ఆలోచించుకుని రాసుకున్నారో అర్థమైంది. సమంత సెట్స్‌లో జాయిన్ అయిన తర్వాత మరింత క్లారిటీ వచ్చింది.
క్యారెక్టర్‌ను మీరెంత కంఫర్ట్‌గా ఫీలయ్యారు?
- నేను క్యారెక్టర్‌ను కంఫర్ట్‌గా ఏమీ ఫీల్ కాలేదు. 96 సినిమా చూసినప్పుడు ఓ రాత్రిలో జరిగే కథే కదా! సులభంగా చేసెయొచ్చులేనని అనుకున్నాను. అయితే నా కెరీర్‌లో నేను చాలా కష్టపడి చేసిన సినిమా ఏదైనా ఉందంటే జానునే. తొలిసాంగ్‌ను 20 రోజుల పాటు కెన్యా ఇతర ప్రాంతాల్లో హార్డ్ వర్క్‌తో చిత్రీకరించాం. ఆ సమయంలో నాకు యాక్సిడెంట్ కూడా అయ్యింది. ఇవన్నీ ఒక పక్క ఉంటే.. మరో పక్క సమంత సీన్స్‌ను తినేస్తుంది కదా! అని ఆలోచించాను. అలాగే తమిళ చిత్రానికి కంపేర్ చేస్తూ ఎక్కడ ట్రోలింగ్స్ స్టార్ట్ చేస్తారోనని ఆలోచించాను. ఇన్ని ఆలోచనలున్నప్పుడు కంఫర్ట్ ఎక్కడుంటుంది. అలాగని ఇబ్బంది పడలేదు. తపన పడ్డాను. డైరెక్టర్‌కి ఏం కావాలో అందివ్వడానికి తాపత్రయపడ్డాను.
సినిమా షూటింగ్ సమయంలో మీ ఆలోచన శైలి ఎలా ఉండేది?
- తక్కువ డైలాగ్స్, ఎక్కువ హావభావాలు పలికించాలి. చాలా కష్టమే. కానీ క్యారెక్టర్‌లో బాగా ఇన్‌వాల్వ్ అయ్యాను. సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు ఆ క్యారెక్టర్ మూడ్‌లోనే ఉండేవాడిని.
మీరు రీ యూనియన్ పేరుతో స్నేహితులను కలుస్తుంటారా?
- రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ఈ మధ్యన సినిమా షూటింగ్‌ల కారణంగా తగ్గింది. నేను, చరణ్, విక్కీ క్లాస్‌మేట్సే కదా.
మీ లైఫ్‌లో ఫస్ట్ లవ్ బ్రేకప్‌లాంటి విషయమేదైనా జరిగిందా?
- సాధారణంగా ఫస్ట్ లవ్‌ని పెళ్లి చేసుకునే కుర్రాళ్లు ఐదు శాతానికి మించి ఉండరు. చాలా మందికి బ్రేకప్స్ ఉంటాయి. అలా నా జీవితంలో జరిగింది కాబట్టే నేను సినిమా చేశానేమో.
యాక్టర్‌గా ఏ సీన్‌కు బాగా కనెక్ట్ అయ్యారు?
- నీ పెళ్లి జరిగేటప్పుడు నేను వచ్చాను జాను అని రామచంద్ర పాత్ర జానుకి చెప్పే సీన్ నా జీవితంలో జరిగింది కాబట్టి.. ఆ సీన్‌ను బాగా కనెక్ట్ అయ్యాను.
సినిమాకు ఎలాంటి ప్రశంసలు వస్తున్నాయి?
- సినిమా చూసిన వారందరూ అసలు రీమేక్‌లా అనిపించడం లేదు ఫ్రెష్ మూవీలా అనిపిస్తుంది అంటున్నారు. అదే మా తొలి సక్సెస్ అని భావిస్తున్నాం. అలాగే విజయ్ సేతుపతి, త్రిషను మరచిపోయి శర్వా, సమంతనే చూస్తున్నామని అన్నారు. ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల నుండి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో మాటలు రావడం లేదు.
సమంతతో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్?
- ఎవరూ ఊరకనే సూపర్‌స్టార్స్ అయిపోరు. ఈ సినిమాలో ఆమెతో కలిసి నటించడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆమె ఎక్కడా గర్వపడదు. ప్రతిషాట్‌ను స్క్రీన్‌లో చూసుకుని ఇంకా బెటర్‌మెంట్ ఎలా చేయాలా? అని చేసేది. ఆమెను చూసి నేను కూడా ఇప్పుడు సీన్స్‌ను స్క్రీన్‌పై చూసుకోవడం మొదలు పెట్టాను. ఆమె ఫార్ములాను నేను స్టార్ట్ చేశాను. ప్రతి సీన్‌ను ఇద్దరం డిస్కస్ చేసుకుని చేశాం.
రెండు పాత్రలతో సినిమాను నడిపించడం అనేది రిస్క్ అనిపించలేదా?
- అలాంటివి ఆలోచించలేదు. ఓసారి నమ్మాను కదా.. కాబట్టి రిస్క్ గురించి ఆలోచించలేదు. నటుడుగా పాత్రకు న్యాయం చేయడానికి వందశాతం ప్రయత్నిస్తాను. అయితే రెండు పాత్రలతో సినిమాను నడిపించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ క్రెడిట్ మాత్రం డైరెక్టర్ ప్రేమ్‌కే దక్కుతుంది. సాధారణంగా నటుడిగా ఎన్నో హిట్స్ రావచ్చు. కానీ కొన్ని సినిమాలే గుర్తుండిపోతాయి. అలా నా కెరీర్‌లో నాకు గుర్తుండిపోయే సినిమా జాను. నటుడిగా నా ఆకలిని తీర్చిన సినిమా ఇది.
రీమేక్ సినిమాలు చేయడం నటుడిగా మీకెలా అనిపిస్తుంది?
- నిజానికి నేను రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే రీమేక్స్ చేస్తే.. అంతకు ముందు ఆ పాత్ర చేసిన హీరోతో పోల్చి చూస్తారు. మనకు తెలియకుండానే ఒత్తిడి ఉంటుంది.
సినిమాలు చేయడంలో స్పీడు పెంచినట్టున్నారుగా?
- పడిపడి లేచె మనసు, రణరంగం సినిమాల తర్వాత మంచి కథలున్న సినిమాలను, తక్కువ రోజుల కాల్షీట్స్‌తో చేయాలని అక్షయ్‌కుమార్‌లా నిర్ణయిం తీసుకున్నాను. మూడు సినిమాలు పూర్తి కాగానే.. మరో మూడు సినిమాలను ట్రాక్ ఎక్కిస్తాను.
‘శ్రీకారం’ ఎంత వరకు వచ్చింది?
- దాదాపు పూర్తి కావొస్తుంది. ఏప్రిల్ 24న విడుదల చేయాలనుకుంటున్నాం. ఇందులో రైతు పాత్రలో కనపడతాను. రైతు కొడుకు రైతు ఎందుకు కాకూడదు? అనే పాయింట్‌ను ఆధారంగా సినిమా ఉంటుంది. జెన్యూన్ అటెంప్ట్. మార్చికి రెండు సినిమాలు పూర్తి చేస్తాను. ఇందులో ఎవరిపై విమర్శలు చేయడం లేదు. తండ్రీ కొడుకుల మధ్య జరిగే సంఘర్షణే ఈ చిత్రం.
మీ ద్విభాషా చిత్రం ఎంత వరకు వచ్చింది?
- సినిమా అనుకున్నాం కానీ.. ఎప్పుడు చేయాలని అనుకోలేదు. నాకు తెలిసి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. ఇది అమ్మ కొడుకు కాన్సెప్ట్ మీద నడిచే సినిమా. అక్కినేని అమలగారితో కలిసి నటిస్తున్నాను.