కొత్త బెంచ్‌మార్కులు సెట్ చేయడానికి రెడీ అవుతున్న ‘ఆర్ఆర్ఆర్’
రాజమౌళి సినిమా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ డేట్ జనవరి 8 అనేది ఖరారయ్యింది. దీంతో మిగతా భారీ ప్రాజెక్టుల నిర్మాతలు తమ సినిమాల్ని ఎప్పుడు రిలీజ్ చేసుకోవాలో చాలా ముందుగానే వెసులుబాటు కలిగింది. వాస్తవానికి పవన్ కల్యాణ్ - క్రిష్ మూవీ, మహేశ్ - వంశీ పైడిపల్లి మూవీ 2021 సంక్రాంతికి టార్గెట్ చేసుకున్నాయని వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమాలు వేరే డేట్లను ఎంచుకుంటాయా, లేక సంక్రాంతికి రావడానికే మొగ్గు చూపుతాయా.. అనే విషయం తేలాల్సి ఉంది.
మరోవైపు బిజినెస్ పరంగా ‘ఆర్ఆర్ఆర్’ సంచలనం స్టార్ట్ అయ్యింది. ‘బాహుబలి 2’ కు ఊహాతీత స్థాయిలో ప్రి బిజినెస్ జరిగిందనుకుంటే, ఇప్పుడు దాన్ని కూడా ‘ఆర్ఆర్ఆర్’ దాటేయడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘బాహుబలి 2’ మూవీ 122 కోట్ల రూపాయల ప్రి బిజినెస్ జరగగా, ఇప్పుడు దాన్ని రాజమౌళి - జూనియర్ ఎన్టీఆర్ - రాంచరణ్ మూవీ పెద్ద మార్జిన్‌తో దాటేయనున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు ఏరియాల బిజినెస్ డీల్ పెండింగ్‌లో ఉండగా, మిగతా ఏరియాల బిజినెస్ విలువ 150 కోట్ల రూపాయలు దాటేయడం విశేషం. ఒక్క నైజాం ఏరియాలోనే ‘బాహుబలి 2’ కంటే ‘ఆర్ఆర్ఆర్’ 25 కోట్ల రూపాయలు ఎక్కువగా బిజినెస్ చేసింది. ఈ ఏరియాలో ‘బాహుబలి 2’, ‘సాహో’ సినిమాల ప్రి బిజినెస్ విలువ 40 కోట్ల రూపాయలు కాగా, ‘ఆర్ఆర్ఆర్’ ప్రి బిజినెస్ విలువ 65 కోట్ల రూపాయలు. యథాప్రకారం దిల్ రాజు ఈ హక్కుల్ని పొందారు.
ఇదే ఏరియాలో విడుదల తర్వాత ‘బాహుబలి 2’ సుమారు 67 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. అంటే దాదాపు దాని కలెక్షన్ల విలువకు సమానంగా ‘ఆర్ఆర్ఆర్’ ప్రి బిజినెస్ జరిగిందన్న మాట. సీడెడ్‌లోనూ అనూహ్య స్థాయిలో 40 కోట్ల రూపాయల మేరకు ప్రి బిజినెస్ జరిగిందని సమాచారం. విడుదలకు ఇంకా దాదాపు ఏడాది సమయం ఉండగానే ప్రి బిజినెస్ పరంగా కనీ వినీ ఎరుగని సంచలనం సృష్టిస్తోన్న ఈ సినిమా ఇక బాక్సాఫీస్‌ను ఎలా దద్దరిల్లజేస్తుందో చూడాల్సిందే. ఇంతదాకా ప్రి బిజినెస్ పరంగా చూసినా, బాక్సాఫీస్ పరంగా చూసినా బెంచ్‌మార్క్స్‌ను సెట్ చేసిన ‘బాహుబలి 2’ను తిరగరాసే దిశగా ‘ఆర్ఆర్ఆర్’ పయనిస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెలాఖరులోగా ‘ఆర్ఆర్ఆర్’ కాన్సెప్ట్ టీజర్ రిలీజ్ కానున్నది. అలాగే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న ఆయన ఫస్ట్ లుక్, తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20న ఆయన ఫస్ట్ లుక్ విడుదల కానున్నాయి.