శర్వానంద్ హీరోగా వచ్చిన "రన్ రాజా రన్" సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన యువ దర్శకుడు సుజిత్, ఆ తర్వాత ప్రభాస్ తో సాహో సినిమా తీసిన విషయం తెలిసిందే. రన్ రాజా సినిమాకి ముందు అతడు ఏ దర్శకుడి వద్ద కూడా అసిస్టెంట్ గా పనిచేయలేదు. దర్శకత్వ శాఖలో అనుభవం లేకపోయినా ౩౮ షార్ట్ ఫిలిమ్స్ తీసిన అనుభవం ఉన్న కారణంగా అతడికి రన్ రాజా రన్ అవకాశం వచ్చింది.
ఆ అవకాశాన్ని సుజిత్ సద్వినియోగం చేసుకున్నాడు కూడా.. అయితే రన్ రాజా రన్ సినిమా తర్వాత తీసిన సాహో సినిమా మాత్రం తీవ్ర నిరాశని మిగిల్చింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ సినిమా వస్తుందంటే అందరి అంచనాలు ఆకాశంలో పెట్టుకున్నారు. ఆ అంచనాలని అందుకోవడంలో సాహో సినిమా ఘోరంగా విఫలమైంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఈ సినిమా ఘోర పరాజయం చవి చూసింది.
అయితే విచిత్రంగా ఉత్తరాదిన మాత్రం మంచి వసూళ్ళు సాధించింది. ఇదిలా ఉంటే సాహో డిజాస్టర్ తర్వాత సుజిత్ ఎవరితో సినిమా తీస్తాడనేది ఆసక్తిగా మారింది. సాహో డిజాస్టర్ తర్వాత సుజిత్ కి ఎవరు అవకాశం ఇస్తారు అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే అనధికార సమాచారం ప్రకారం సుజిత్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. సుజిత్ తన లైన్ ని వినిపించడం జరిగిందని, పూర్తి స్క్రిప్టు సిధ్ధం చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది. మరి చరణ్ గనక ఓకే అంటే నిర్మాత దొరకడం అంత పెద్ద కష్టం కాకపోవచ్చు.