సంక్రాంతి సీజన్‌లో ఢీ అంటే ఢీ అని పోటీపడ్డ మహేశ్, అల్లు అర్జున్.. ఇద్దరూ విజేతలుగా నిలిచారు. ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ మహేశ్ కెరీర్‌లో, ‘అల వైకుంఠపురములో’ సినిమా బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద సీజన్ వేసవే. ఈ సీజన్‌లో టాప్ హీరోల సినిమాలు వచ్చే అవకాశాలు లేవనీ, టైర్-2 హీరోల సినిమాలతోటే సర్దుకుపోవాల్సిన పరిస్థితి ఉందనీ ఇప్పటిదాకా ప్రేక్షకులు భావిస్తూ వచ్చారు. అయితే వారి ఆశల్ని నిలబెడుతూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వేసవికి వస్తున్నాడు. ఆయన లాయర్‌గా నటిస్తోన్న ‘పింక్’ రీమేక్ మే 15న విడుదలవుతుందని దాని ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రకటించాడు. ఈ సినిమా కోసం ఫిల్మ్ చాంబర్‌లో ‘వకీల్ సాబ్’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించినప్పటికీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఉగాది సందర్భంగా మార్చి 25న టైటిల్‌ను ప్రకటించనున్నారు.
కాగా మే 15న పవర్ స్టార్ సినిమా వస్తుందనే వార్త ఆయన ఫ్యాన్స్‌తో పాటు సగటు సినిమా ప్రియుల్నీ ఆనందంలో ముంచెత్తింది. మార్చి నుంచి మే వరకు వేసవి సీజన్ అనుకుంటే.. నాని (వి), నాగచైతన్య (లవ్ స్టోరీ), రాజ్ తరుణ్ (ఒరేయ్ బుజ్జిగా), రామ్ (రెడ్), శర్వానంద్ (శ్రీకారం), సాయితేజ్ (సోలో బ్రతుకే సో బెటర్), రవితేజ (క్రాక్) వంటి హీరోల సినిమాలు, అనుష్క (నిశ్శబ్దం) వంటి హీరోయిన్ సినిమాలు ఈ సీజన్‌లో వస్తున్నాయి. సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ (ఉప్పెన), సత్యదేవ్ (ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య) సినిమాలూ అప్పుడే వస్తున్నాయి.
మాస్ స్టార్స్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వాళ్లెవరూ వేసవికి వస్తున్న దాఖలాలు లేవు. మహేశ్, బన్నీ ఇప్పటికే వచ్చేశారు కాబట్టి, ఈ ఏడాది వాళ్ల నుంచి మరో సినిమా రావట్లేదు. ఈ నేపథ్యంలో వేసవిని క్యాష్ చేసుకోవడానికి పవర్‌స్టార్ రెడీ అవుతున్నాడు. బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పింక్’ కు రీమేక్‌గా తయారవుతున్న ఈ సినిమాలో సెక్సువల్ హెరాస్‌మెంట్‌కు గురైన ముగ్గురు యువతుల తరపున కోర్టులో వాదించే లాయర్ క్యారెక్టర్లో పవన్ కనిపించనున్నాడు.
హిందీ ఒరిజినల్‌తో పోలిస్తే చాలా మార్పులతో ఈ మూవీని డైరెక్టర్ శ్రీరామ్ వేణు రూపొందిస్తున్నాడని దిల్ రాజు తెలిపాడు. ‘పింక్’ లో అమితాబ్ ఫైట్లు చెయ్యరు. కానీ తెలుగు వెర్షన్‌లో పవన్ కల్యాణ్ ఫైట్లు చేస్తున్నాడు. ఇప్పటికే వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్న ఆయన మార్చిలోగా మరో రెండు వారాలు ఈ సినిమా కోసం కేటాయించి, తన సన్నివేశాల్ని పూర్తి చేయనున్నాడు. ‘అజ్ఞాతవాసి’ (2018) తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్‌తో వస్తున్నందున పవన్ ఫ్యాన్స్, జనరల్ ఆడియెన్స్ ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మునుపటి సినిమాతో నిరాశ పరచిన పవన్ ఈ సినిమాతో తమను కచ్చితంగా ఆకట్టుకుంటాడని వాళ్లు నమ్ముతున్నారు.