మాస్ సినిమాలు తీయడంలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పర్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, మొన్నటికి మొన్న వరుణ్ తేజ్ తో తీసిన గద్దలకొండ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో వరుణ్ తేజ్ ని నెగెటివ్ షేడ్స్ లో కొత్తగా చూపించాడు. వరుణ్ తేజ్ లోని మాస్ యాంగిల్ గద్దలకొండ సినిమా ద్వారానే బయటపడింది. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం వచ్చింది.
పవన్ కళ్యాణ్ ఈ సంవత్సరం వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. అయితే అందులో ఒకటి షూటింగ్ జరుపుకుంటుంది. మరో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. ఆ మూడు సినిమాల్లో ఒకదానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన "గబ్బర్ సింగ్" ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న పవన్ కళ్యాణ్ కెరీర్లో ఈ సినిమా కీలక మలుపుకి సాయపడింది.
స్వతాహాగా పవన్ కళ్యాణ్ అభిమాని అయిన హరీష్ శంకర్, ఒక అభిమాని పవన్ కళ్యాణ్ ని ఎలా చూడాలని అనుకుంటున్నాడో అలా చూపించి అభిమానులకి ఆనందాన్ని పంచాడు. అయితే ఇప్పుడు మళ్లీ వీరిద్దరు జత కట్టబోతున్న తరుణంలో పవన్ అభిమానుల నుండి హరీష్ శంకర్ కి రిక్వెస్టులు వెల్లువెత్తుతున్నాయట. తమ అభిమాన హీరోని ఎలా చూపించాలని వాళ్ళు భావిస్తున్నారో చెప్తూ సూచనలిస్తున్నారట.
అభిమానుల రిక్వెస్టులకి అనుగుణంగా ఆలోచిస్తూ, హరీష్ శంకర్ ఎలాంటి కథని సిద్ధం చేస్తాడో మరి. ఒక్కటి మాత్రం నిజం.. వీరిద్దరి కాంబినేషన్ అనగానే గబ్బర్ సింగ్ సినిమానే గుర్తు వస్తుంది. ఇప్పుడు వచ్చే సినిమా ఆ సినిమాకి ఏమాత్రం తగ్గకూడదు. స్వతాహాగా రచయిత అయిన హరీష్ శంకర్ ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటాడని ఆశిద్దాం.