ఈమధ్యన తమిళనాట ఏ సినిమా హిట్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగు హీరోలు. అక్కడ హిట్ అయిన సినిమాని తెలుగులో డబ్ చెయ్యకుండా రీమేక్ రైట్స్ కొనుక్కుని సినిమాలు చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు. ఈమధ్య కాలంలో అల రాక్షసుడు సినిమా హిట్ అవగా.. తాజాగా సమంత - శర్వాలు తమిళ 96 రీమేక్ చేసారు. అలాగే వెంకటేష్ ధనుష్ అసురన్ సినిమాని నారప్పగా రీమేక్ చేయడం మొదలెట్టాడు. మరి అక్కడ హిట్ పడడం ఇక్కడ నిర్మాతలు రైట్స్ కొనెయ్యడం ఆ రీమేక్ ల కోసం హీరోలు పోటీ పడడం అనేది సర్వసాధారణమైంది.
మరి తాజాగా తమిళనాట మిస్కిన్ డైరెక్షన్లో ఉదయనిధి స్టాలిన్, అదితి హైదరి, నిత్యా మీనన్ కలిసి నటించిన సైకో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మిస్కిన్ గతంలో క్రైం థ్రిల్లర్ డిటెక్టీవ్, సస్పెన్స్ థ్రిల్లర్ పిశాచి సినిమాల వలె సైకో కూడా సస్పెన్స్ అండ్ హర్రర్ ఫిలింగా తెరకెక్కించాడు. ఇప్పుడు సైకో సినిమా తమిళ ప్రేక్షకులను ఓ ఊపు ఊపుతుంది. అయితే గర్భిణులు, వయసు పైబడినవాళ్ళు చూడవద్దని చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్ తో తెలుగు ప్రేక్షకులకు ఆ సైకో సినిమాపై ఆసక్తి ఖచ్చితంగా ఏర్పడుతుంది. మరి అలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ ఎలాగూ తెలుగులో డబ్ కాలేదు కాబట్టి.. తెలుగు హీరోలేమైనా రీమేక్ ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి. మరి హిట్ అయిన సినిమా కదా.. మన హీరోలు వదలరనిపిస్తుంది.