టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇటు సినిమాలు.. అటు వ్యాపారాలు.. గ్యాప్ దొరికినప్పుడు ప్రకటనలు ఇలా వరుసగా బిజీ అయిపోతున్నాడు. ఇప్పటికే మల్టిఫ్లెక్స్, బట్టల వ్యాపారంలోకి దిగిన మహేశ్.. తాజాగా మరో భారీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏఎంబీ లాగే ఎవరితోనూ పార్టనర్‌షిప్ లేకుండా సొంతంగా ఓ భారీ మల్టీఫ్లెక్స్‌ను నిర్మించాలని భావిస్తున్నాడట. అంతేకాదండోయ్.. అది కూడా మెట్రో నగరమైన బెంగళూరులోనట. మొదట అక్కడ.. తర్వాత చెన్నైలో నిర్మించాలని యోచిస్తున్నాడట. అన్నీ అనుకున్నట్లు జరిగితే భూమి పూజ చేసేసి తన తదుపరి చిత్రం పూర్తయ్యే లోపు కొత్త థియేటర్ నిర్మాణం పూర్తి చేసి అందులోనే రిలీజ్ చేయాలని మహేశ్ అనుకున్నాడట.
కాగా.. ఇప్పటికే ఏషియన్ సినిమా వాళ్లతో కలిసి హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో ఏఎంబీ సినిమాస్‌ను ప్రారంభించిన మహేశ్.. పార్టనర్‌షిప్ లేకుండా అది కూడా.. ఏఎంబీని మించిన భారీ మల్టీఫ్లెక్స్ అంటే బాబు.. భగీరథ ప్రయత్నమే చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఏఎంబీ మొత్తం 7 స్క్ర్రీన్లతో, 1,600 సీటింగ్ కెపాసిటీతో ప్రారంభించడం జరిగింది. అంటే.. అంతకు మించి అంటే ఇంచుమించు 10 స్క్రీన్స్ అయినా ఉండాలి. అయితే సొంతంగా నిర్మించాలని భావిస్తుండటంతో కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ పేర్లు కలిసుండేలా ఓ మంచి పేరును చూడాలని సన్నిహితులకు మహేశ్ చెప్పాడట. అమెరికా పర్యటనకు వెళ్తున్న మహేశ్ తిరిగొచ్చాక ఈ భారీ మల్టీఫ్లెక్స్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయ్. మరి ప్రకటన ఉంటుందో లేదో వేచి చూడాల్సిందే.