‘అర్జున్ రెడ్డి’, ‘గీతా గోవిందం’ సినిమాలు సూపర్ డూపర్ హిట్టవ్వడంతో కుర్ర హీరో విజయ్ దేవరకొండకి క్రేజ్ పెరగింది. మరోవైపు తన సినిమాల మీద ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఓ లెవల్లో పెరిగింది. మరీ ముఖ్యంగా ‘నోటా’ సినిమాలా ప్లాప్ అవకూడదని.. ‘డియర్ కామ్రేడ్’ విషయంలో విజయ్ తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్ని కావు. అయినప్పటికీ ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ఆడకపోయే సరికి మళ్లీ బ్యాక్ టూ ‘అర్జున్ రెడ్డి’ అంటూ అదే తరహా స్టైల్‌లోనే ‘వరల్డ్ ఫేమస్ లవర్’లో ఆయన కనిపించబోతున్నాడు. ఆ హెయిర్ స్టెయిల్.. ఆ అరుపులు చూస్తే చాలా వరకు ‘అర్జున్ రెడ్డి’నే ఫాలో అయ్యాడని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
ఒకరిద్దరు కాదు ఏకంగా నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ అంటే సినిమా ఎక్కడ తేడా కొడుతుందో ఏమో అని అటు విజయ్.. ఇటు నిర్మాతలు జంకుతున్నారట. మరోవైపు సినిమా షూటింగ్ పూర్తి కావడంతో లవర్స్ డే రోజున ప్రేమ పక్షులకు కానుకగా ఇవ్వాలని ఇవ్వాలని భావించి అన్ని కార్యక్రమాలను త్వరిత గతిన చిత్రబృందం చేసుకుంటూ పోతోంది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుండగా సినిమా అనుకున్న డ్యూరేషన్ కంటే ఎక్కువగా రావడంతో అసలు ఏ సీన్ ఉంచాలో ఏ సీన్ తీసి పక్కనేయాలో డైరెక్టర్ క్రాంతి మాధవ్‌కు తోచట్లేదట. ఎందుకంటే.. అన్ని సీన్లు మంచిగానే ఉండటం.. ఏది తీసేసినా ఫ్లో మిస్సవుతుందని.. మరీ ఎక్కువగా డ్యూరేషన్ అంటే ప్రేక్షకులకు ఎక్కడ బోర్ కొట్టేస్తుందో అని.. ఇలా లింకులతో డైరెక్టర్ జుట్టు పీక్కుంటున్నాడట.
గత వారం రోజులుగా రాత్రింపగళ్లు దగ్గరుండి మరీ డైరెక్టర్ ఎడిటింగ్ చేయిస్తున్నాడట. అంతేకాదండోయ్.. విజయ్ దేవరకొండ కూడా దర్శకుడి దగ్గరే ఉన్నాడట. ఫైనల్‌గా ఎడిటింగ్ ఎప్పుడు అయిపోతుందో..? సెన్సార్ సర్టిఫికెట్ ఎప్పుడొస్తుందో..? సినిమా ప్రమోషన్స్ ఎప్పుడు షురూ చేస్తారో ఏంటో మరి. మరీ ముఖ్యంగా ఈ సినిమా హిట్టవ్వకపోతే మాత్రం విజయ్ దేవరకొండ పరిస్థితి మాటల్లో మాట్లాడలేం.. రాతల్లో రాయలేమేమో!!.