విజయ్ దేవరకొండ - పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ షురూ
సంచలన కథానాయకుడు విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కలయికలో తయారవుతున్న క్రేజీ మూవీ షూటింగ్ ముంబైలో సోమవారం ఉదయం పూజా కార్యక్రమాలతో మొదలైంది. హీరో విజయ్ దేవరకొండపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి చార్మీ కౌర్ క్లాప్ నిచ్చారు. ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు.
పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లోనూ ఇది రూపొందుతోంది. తన హీరోలను అదివరకెన్నడూ కనిపించని రీతిలో చూపించే స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న పూరి, వారిలోని బెస్ట్ పర్ఫార్మెన్సును రాబట్టడానికి కృషి చేస్తుంటారు. అదే తరహాలో, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.
తన పాత్ర కోసం తీవ్ర శిక్షణ తీసుకున్న ఆ యంగ్ హీరో, తన రూపాన్ని తీర్చిదిద్దుకోడానికి కఠిన ఆహార నియమాలు పాటిస్తున్నారు. థాయిలాండ్ కు వెళ్లిన ఆయన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్, ఇతర పోరాట పద్ధతుల్ని నేర్చుకున్నారు. ఇప్పటి దాకా తను చేసిన పాత్రల్లోనే మోస్ట్ చాలెంజింగ్ రోల్ చేస్తున్న విజయ్ దేవరకొండ, ఈ మూవీలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నారు.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, చార్మీ కౌర్ తో పాటు కరణ్ జోహార్, అపూర్వ మెహతా ఈ యాక్షన్ సినిమాని నిర్మిస్తున్నారు.
రమ్యకృష్ణ, రోణిత్ రాయ్, విష్ణురెడ్డి, అలీ, గెటప్ శ్రీను కీలక పాత్రలు చేస్తున్న ఈ మూవీని ధర్మా ప్రొడక్షన్స్ సమర్పిస్తోంది.
బ్యానర్: పూరి కనెక్ట్స్
సమర్పణ: ధర్మా ప్రొడక్షన్స్
నిర్మాతలు: పూరి జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా