ఈ సంక్రాంతికి రజినీకాంత్ దర్బార్ తో తెలుగులో ప్లాప్ టాక్ తో రెండో రోజుకే డల్ అయితే... మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, బన్నీ అల వైకుంఠపురములో సినిమాతో ఢీ అంటే ఢీ అన్నారు. ఇక కళ్యాణ్ రామ్ మాత్రం పెద్ద పండగ రోజు ఎంతమంచివాడవురా అనిపిస్తాడో లేదో ఎల్లుండి తెలిసిపోతుంది. ఇక మహేష్ - అల్లు అర్జున్ సంక్రాంతి పోరు యమా రంజుగా ఉంది. మొదటి నుండి పోటాపోటీగా ఉన్న ఈ రెండు సినిమాలు ఇప్పుడు విడుదలయ్యాక కూడా ఆ సినిమా ఇలా ఈ సినిమా ఇలా అంటూ ఫిలింనగర్ లో చర్చలు నడుస్తున్నాయి. మహేష్ బాబు - అనిల్ రావిపూడి మాస్ ఎంటర్టైనర్ గా సరిలేరు నీకెవ్వరుతో హిట్ కొట్టగా.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో తో హిట్ కొట్టారు. అనిల్ రావిపూడి ఈసారి కామెడీ కన్నా ఎక్కువగా యాక్షన్ కి ప్రాధాన్యతనిచ్చి మహేష్ ని మాస్ హీరోగా ఎలివేట్ చేసి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఇక త్రివిక్రమ్ - అల్లు అర్జున్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేసి క్లాస్ హిట్ కొట్టారు.
అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరులో ఫస్ట్ హాఫ్ కామెడీతో లాగించేసి.. సెకండ్ హాఫ్ తో మహేష్ తో యాక్షన్ చేయించాడు. ఇక మొదటి నుండి అన్నివిషయాల్లో పోటీ పడుతున్న ఈ సినిమాల్లో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మ్యూజిక్ కన్నా వెనకబడగా... మహేష్ సరిలేరు టీజర్ ముందు అల వైకుంఠం టీజర్ తగ్గింది. ఇక మహేష్ సరిలేరు ట్రైలర్ కామెడీ, యాక్షన్ తో దూసుకుపోగా.. అల్లు అర్జున్ అల ట్రైలర్ కామెడీ పంచ్లతో కాస్త వెనకబడింది. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో కొద్దిగా నెగెటివ్ పాయింట్స్ ఎక్కువగా ఉంటే.. అలకి నెగిటివ్ పాయింట్స్ తక్కువ ఉన్నాయి. అనిల్ కామెడీ వదిలేసి మహేష్ రూట్ లో మాస్ అంటూ మహేష్ అభిమానులను మెప్పిస్తే.. త్రివిక్రమ్ మాత్రం అల్లు అర్జున్ తో కామెడీ చేయించి మెప్పించాడు.
అసలు అల వైకుంఠపురములో.. సినిమాకు కర్త కర్మ క్రియ త్రివిక్రమ్ అయితే... జనాల్ని తన నటనతో కూర్చో పెట్టేసాడు బన్నీ. చాలా సీన్లతో తన కళ్లతోనే నటించేసాడు. కథ చిన్నదే. కానీ ఎప్పట్లాగే త్రివిక్రమ్ తన మార్క్ కామెడీ, భావోద్వేగాలతో చిత్రాన్ని తీర్చిదిద్దాడు. సున్నితమైన కథ కావడం, కథనం పరంగా కూడా ఎక్కువ మేజిక్కులు చేసే ఆస్కారం లేకపోవడంతో అక్కడక్కడా సినిమా వేగం తగ్గిపోతుంటుంది. అయితే మహేష్ సరిలేరు నీకెవ్వరు మాస్ ఆడియన్స్ కి బిసి సెంటర్స్ ని ఎట్రాక్ట్ చేస్తుంటే.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో క్లాస్ గా మల్టిప్లెక్స్ ఆడియన్స్ ని కూర్చోబెట్టేస్తుంది.