టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇప్పటికే స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన.. మరో టాప్ కమ్ స్టార్ హీరోతో సినిమా తీయడానికి సిద్ధమైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయ్. ఆ స్టార్ హీరో మరెవరో కాదండోయ్.. ‘బాహుబలి’, ‘సాహో’ చిత్రాలతో మంచి ఊపు మీదున్న యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్. వాస్తవానికి ఈ ఇద్దరికీ మంచి సంబంధాలున్నా.. అవి కాస్త సినిమా దాకా ఇంతవరకూ పోలేదు. అయితే ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తోందని.. త్వరలోనే త్రివిక్రమ్- డార్లింగ్ అభిమానుల కల నెరవేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయ్.
ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు చేసిన ప్రభాస్.. ఇప్పుడు ‘జాన్’ సినిమాలో నటిస్తున్నాడు. అయితే దీని తర్వాత సినిమా ఎవరితో ఉంటుంది..? అనేది గత కొన్నిరోజులుగా పెద్ద చర్చే జరుగుతోంది. ప్రభాస్ మాత్రం భారీ బడ్జెట్, లవ్ ట్రాక్, పాన్ ఇండియా లాంటిది కాకుండా ఓ క్లీన్ ఫ్యామిలీ మూవీ చేయాలని అనుకుంటున్నాడట. మరోవైపు ‘అల వైకుంఠపురములో’ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుని కుటుంబ సమేతంగా అందరూ థియేటర్లకు క్యూ కడుతుండటంతో ఫ్యామిలీ సినిమా చేయాలన్న ఆశ ప్రభాస్‌లో మరింత పెరిగిందట. అందుకే ఇక కచ్చితంగా చేస్తే గీస్తే క్లీన్ ఫ్యామిలీ మూవీనే చేయాలని మైండ్‌లో ఫిక్సయ్యాడట.
ప్రభాస్ మనోగతాన్ని తెలుసుకున్న ఓ బడా నిర్మాత ఆ పనులు చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారట. ప్రస్తుతానికి మాటల మాంత్రికుడు ఖాళీగానే ఉన్నారు.. ఇంకా ఎవరితో సినిమా అని అనుకోలేదు కూడా. అంతేకాదు ఆయన దగ్గర ఓ కథ కూడా సిద్ధంగా ఉందని బడా నిర్మాత చెవిన పడటంతో రంగంలోకి దిగి.. ‘ప్రభాస్‌తో చేయండి.. నేను ప్రొడ్యూసర్‌గా ఉంటాను’ అని చెప్పారట. వారిద్దర్నీ త్వరలోనే కలిపి కథ లైన్ వినిపించాలని ఆ నిర్మాత తహతహలాడుతున్నాడట. ఆ ఫ్యామిలీ కథను ప్రభాస్‌కు నచ్చితే ఇక డార్లింగ్-మాటల మాంత్రికుడు ఫ్యాన్స్‌కు పూనకాలే. మరి జాన్ సినిమా ఎప్పుడవుతుందో..? త్రివిక్రమ్ ఎప్పుడు పూర్తి కథను సిద్ధం చేసుకుంటాడో..? అసలు ఈ కాంబోలో వర్కవుట్ అయ్యేనా అనేది ఆ బడా నిర్మాత, మాటల మాంత్రికుడికే తెలియాలి.