టాలీవుడ్ ప్రముఖ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు గాను అధిష్టానం ఆదేశించకమునుపే ఆయన తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను అధిష్టానానికి మెయిల్ రూపంలో పంపారు. కాగా.. ఎస్వీబీసీలో పనిచేసే మహిళా ఉద్యోగినితో ఆయన ‘సరస సంభాషణ’ చేసిన ఆడియో టేపులు నెట్టింట్లో గట్టిగానే వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అవ్వడంతో చేసేదేమీ లేక రాజీనామా చేసేశారు. అయితే ఆ ఆడియో టేపులో ఉండే వాయిస్ మాత్రం తనది కాదని.. తనపై కక్షగట్టి మరీ ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదనకు లోనయ్యారు. ఇదిలా ఉంటే అధిష్టానం ఆదేశించక ముందే ఆయన రాజీనామా చేయడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వివాదాస్పద నటుడిగా పేరుగాంచిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వైసీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత మరింత డోస్ పెంచి మరీ వ్యాఖ్యలు చేసేవారు. అంతేకాదు సొంత ఇండస్ట్రీని సైతం ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఆయన వైసీపీలో చేరడం.. పార్టీ గెలవడం.. ఎస్వీబీసీ చైర్మన్ పదవి వరించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయ్. పైగా ఈయనకు వాక్ చాతుర్యం, విమర్శనాస్త్రాలు గుప్పించడంలో దిట్ట కావడంతో మిగిలిన నటులు కమ్ వైసీపీ నేతల కంటే ముందుగానే ఈయన పదవి దక్కించుకున్నారు. అయితే ఆ పదవిని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోవడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. ఆయన ఆడియో టేప్స్‌పై ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. తాను మద్యం సేవించనని.. సేవించినట్లు నిరూపించాలని అవసరమైతే బ్లడ్ శ్యాంపిల్స్ కూడా ఇస్తానని పృథ్వీ చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన ఈ సందర్భంగా తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమేనని.. ఇకపై తన గురించి విమర్శించిన వారిని ఒక్కొక్కర్ని ఆడుకుంటానని.. తానేంటో చూపిస్తానన్నారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధమని నిరూపించుకున్న తర్వాతే ఎస్వీబీసీలోకి అడుగుపెడతానని ఈ సందర్భంగా థర్టీ ఇయర్స్ పృథ్వీ స్పష్టం చేశారు. మరి పరిస్థితులు ఎలా ఉంటాయ్..? ఆ ఆడియో టేపులు ఎంతవరకు నిజం..? రాజీనామా చేయమని అధిష్టానం ఆదేశించక ముందే ఆయన రాజీనామా చేయడం..? పలు అనుమానాలకు తావిస్తోంది.. మరి ఫైనల్‌గా ఏం తేలుతుందే..? అనేది తెలియాలంటే వేచి చూడక తప్పదు.