Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ ఫస్ట్ క్రష్ ఎవరితోనో తెలుసా..!?


ఓ విశ్వ విఖ్యాత

Advertisement
CJ Advs

నట సార్వభౌమా !

నీ అనంత అభినయ

విశ్వరూపముల్ గాంచి విశ్వమంతయు

విస్మయ మొందగా ...

నీ దివ్య మంగళ రూపము ..

నీ సహస్ర భాను తేజము..

తెలుగు జాతి ఎద ఎదలో

పదిలంగా నిలిచిపోవ

 చరితార్థుడవైతివయ్యా

ఘన చరితగ నిలిచితివయ్యా..

ఇదీ ‘నందమూరి తారక రామారావు’ అనే దివంగత దివ్య పురుషుని సమగ్ర చరిత్రను ఆమూలాగ్రం చదివిన తరువాత ఎవరి మనసులోనైనా కలిగే భావన. ఇంతకీ ఆయన చరిత్రను అంత సమూలాగ్రంగా, సమగ్రంగా ఎవరు రాశారు...? ఎప్పుడు రాశారు..? ఎలా రాశారు..? అన్న సందేహాలకు సమాధానంగా నిలుస్తుంది 624 పేజీల ‘ఎన్టీఆర్-సమగ్ర జీవిత కథ’ అనే ఉద్గ్రంధం.

గతంలో ఎన్టీఆర్ మీద చాలా పుస్తకాలు వచ్చాయి.. అయితే రకరకాల కారణాల వల్ల అవి కొన్ని పరిమితులకు లోబడి, ఆయన సుదీర్ఘ సినీ రాజకీయ ప్రస్థానంలోని కొన్ని పార్శ్వాలను మాత్రమే స్పృశించాయి. సారస్వత దృష్టితో చూస్తే అవి గొప్ప ప్రయత్నాలే అయినప్పటికీ సమగ్రత విషయంలో ఆ పుస్తకాలు ఏవీ ఈ పుస్తకానికి సాటి రావు అన్నది నిర్వివాదాంశం. ఎందుకంటే జనన మరణాల మధ్య జరిగిన సంఘటనల బయోడేటా జీవిత చరిత్ర అనిపించుకోదు. దశాబ్దాలపాటు జన జీవితంతో మమేకమైన ఎన్టీఆర్ లాంటి మహానటుడు,మహానాయకుడి జీవితంలో చోటుచేసుకున్న అనేకానేక సంఘటనలను,  ఎదురైన విషమ పరిస్థితులను , సాగించిన పోరాటాన్ని, సాధించిన విజయ విశేషాలను , చేరుకున్న స్థాన విశిష్టతను గురించి ఆమూలాగ్రంగా ఆవిష్కరించ గలిగినప్పుడే అది సమగ్ర చరిత్ర అవుతుంది. అలాంటి సాధికారిక సమాచారంతో , ఎన్టీఆర్ జీవిత విశేషాల పట్ల సమగ్ర అవగాహనతో, ప్రామాణికత, పారదర్శకతలే ప్రమాణాలుగా  ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడి జీవిత చరిత్రకు అక్షర రూపం ఇచ్చారు ఇద్దరు విశ్రాంత ఉన్నతాధికారులు.

:- తమ సుదీర్ఘ పదవీ కాలంలో సమర్ధులైన అధికారులుగా, కార్యదక్షులుగా ప్రశంసలు అందుకున్న ఆ ఇద్దరిలో మొదటివారు ఇన్ కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గా ఉద్యోగ విరమణ చేసిన కాటా చంద్రహాస్ కాగా రెండవవారు  పలు ఉన్నత పదవులు నిర్వహించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొడిదెల లక్ష్మీనారాయణ. ఈ విశ్రాంత అధికారుల అవిశ్రాంత శ్రమ కారణంగా వెలుగు చూసిన ‘యన్. టి.ఆర్’. అనే  ఈ గ్రంథం ఆ నటరత్న గురించి ఎన్నెన్నో అనావిష్కృత విశేషాలను, వివరాలను మన ముందు ఆవిష్కరిస్తుంది. నిజానికి ఇందులో తొలిసారిగా వెలుగుచూసిన వివరాలు, విశేషాలు, వినోదాలు, వివాదాలు, నిజాలు, రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో.. మచ్చుకు కొన్ని వెలుగు చూడని వివరాలను, సంఘటనలు ఈ పుస్తక సమీక్షలో ప్రస్తావించుకుందాం.

:- సినీరంగ ప్రవేశానికి ముందు ఎన్టీఆర్ చేసిన ఉద్యోగాలు, వ్యాపారాలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన విజయవాడలో పాల వ్యాపారం చేస్తూ ఉదయాన్నే సైకిల్ మీద వెళ్లి హోటళ్లకు పాలు పోసేవారన్నదొక్కటే ప్రచారంలో ఉంది. కానీ ఆయన పాల వ్యాపారమే కాకుండా చాలా చేశారు. బొంబాయి మాతుంగాలో కొన్నాళ్ళు ఆంధ్రా మెస్ నడిపారు. విజయవాడలో పొగాకు, బీడీ, సిగరెట్లు అమ్మే హోల్ సేల్ వ్యాపారం చేశారు. 64 రూపాయల జీతానికి కోర్టు అటెండర్ గా కొద్ది రోజులు పని చేశారు.. కొంతకాలం ప్రింటింగ్ ప్రెస్ నడిపారు... చివరకు బిఏ పాస్ అయ్యాక కేవలం 11 రోజులు సబ్ రిజిస్ట్రార్ గా చేశాక దానికి రిజైన్ చేసి సినీ ఫీల్డ్ కు వెళ్లారు. వీటిలో పాల వ్యాపారం,సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం గురించి తప్ప మిగిలిన వాటి గురించి జనసామాన్యానికి తెలియదు. ఆ వివరాలను సవివరంగా ఈ పుస్తకంలో తెలియజేశారు.

:- రాజసం ఉట్టిపడే అందాల కథానాయకుడిగా ఎందరెందరో అందాల నాయికలతో సరస శృంగార సన్నివేశాల్లో నటించిన ఎన్టీఆర్ నిజజీవితంలో కూడా మంచి రసరాజే అంటారు. వెండితెర మీదే కాకుండా నిజజీవితంలో కూడా నవరస భరితంగా సాగిన ఎన్టీఆర్ జీవితంలో ‘ఫస్ట్ క్రష్’ గురించి ఎవరికైనా తెలుసా?. విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో తమ ఇంట్లో అద్దెకుండే సూర్యనారాయణ అనే వ్యాపారి పెద్ద కూతురుతో ఎన్టీఆర్‌కు ఫస్ట్ క్రష్ ఏర్పడిందన్న నిజం చాలా మందికి తెలియదు. అలాగే తనతో దాదాపు 25 చిత్రాలలో హీరోయిన్ గా నటించిన  పేరులో ‘కుమారి’ అని ఉండే ఒక అగ్ర కథానాయికతో ఎన్టీఆర్ ప్రేమ వ్యవహారం పెళ్లి దాకా వెళ్ళిన బహిరంగ రహస్యంలోని ఆంతరంగిక విషయాలు ఈ పుస్తకంలో చాలా ఉన్నాయి.

:- ‘ సార్.. ఈ ‘పాతాళ భైరవి’ సినిమాలో తోటరాముడు పాత్ర కోసం వ్యాయామము, కర్ర సాము ప్రాక్టీస్ చేస్తూ చాలా కష్టపడుతున్నాను సార్.. చాలా ఆకలి వేస్తుంది... ప్రొడక్షన్ లో నాకు పెడుతున్న రెండు ఇడ్లీలు చాలటం లేదు... అదనంగా మరో రెండు ఇడ్లీ పెట్టమని చెప్పండి సర్.. అంటూ ఎన్టీఆర్ విజయా అధినేత  నాగిరెడ్డిని  ప్రాధేయపడిన ప్రారంభ దినాల నాటి కష్టసుఖాలను, ఎన్టీఆర్ ఎదుగుదలను ఈ పుస్తకంలో చాలా వివరంగా ఆవిష్కరించారు.

:- రాముడిగా, శ్రీకృష్ణుడుగా తెలుగువారి హృదయాల్లో, పూజా మందిరాల్లో తన రూపాన్ని ప్రతిష్టింప చేసుకున్న ఎన్టీఆర్‌ను తొలుత శ్రీకృష్ణుడి గెటప్‌లో ప్రేక్షకులు తిరస్కరించారన్న విషయం చాలా మందికి తెలియదు. కృష్ణుడి వేషంలో ఈలపాట రఘురామయ్యను మాత్రమే చూడటానికి అలవాటుపడిన ఆనాటి ప్రేక్షకులు ‘సొంత ఊరు, ఇద్దరు పెళ్ళాలు’ అనే రెండు సాంఘిక చిత్రాలలో ఎన్టీఆర్‌ను కృష్ణుడి గెటప్‌లో చూసి హేళనగా గొడవ చేశారన్నది ఒక నమ్మలేని నిజం. ఇలాంటి ఆవిష్కృతంకాని అనేకానేక విశేషాల సమాహారంగా రూపొందింది ‘ఎన్టీఆర్’  అనే పుస్తకం.

:- లక్ష్మీపార్వతి ‘మీ జీవిత చరిత్ర రాస్తాను’ అని అడిగిన వెంటనే ఎన్టీ రామారావు ఆనందంగా అలాగే అని ఆహ్వానం పలకలేదు. జీవిత చరిత్ర రాయించుకోగలిగినంత చరిత్ర, అర్హత నాకు ఉన్నాయా..? అని సంశయంలో పడ్డారు ఎన్టీఆర్. ఆ సంశయ నివృత్తి కోసం తన సాహిత్య మిత్రులైన డాక్టర్ నండూరి రామకృష్ణ చార్య, ప్రొఫెసర్ దోనప్ప వంటి కొందరు విజ్ఞుల సలహాలు తీసుకున్నారు.

:- స్వయం కృషితో, క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకున్న మీ చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకం అవుతుంది’ అని వారంతా ఏకగ్రీవంగా చెప్పిన పిమ్మటే లక్ష్మీపార్వతి అభ్యర్థనకు ఆమోదం తెలిపారట ఎన్టీఆర్.

:-  ఇలా ప్రచారానికి వాస్తవానికి పొంతనలేని ఎన్నెన్నో వాస్తవాలను, సంఘటనలను, సంధర్భాలను సంఘర్షణలను, సంచలనాలను సంధర్భోచితంగా, సాధికారికంగా ఒక పరిణామక్రమంలో ఆవిష్కరించారు గ్రంథ రచయితలైన చంద్రహాస్, లక్ష్మీనారాయణ. కేవలం సినిమా రంగానికి చెందిన విశేషాలకే పరిమితం కాకుండా  ప్రాంతీయ, జాతీయ స్థాయి రాజకీయాలలో ఎన్టీఆర్ ప్రవేశ, ప్రభంజన, ప్రభావ, పరిణామాల గురించి చాలా పారదర్శకంగా, పరిశీలనాత్మకంగా, తులనాత్మకంగా విశదీకరించారు ఈ విశ్రాంత ఉన్నతాధికారులు. 

624 పేజీల ఈ గ్రంధాన్ని  5 భాగాలుగా 107 అధ్యాయాలుగా వర్గీకరించి ప్రతి అధ్యాయాన్ని ఆసక్తికరమైన విషయ విశేషాలతో తీర్చిదిద్దారు రచయితలు. ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తి  జీవితంలోని ఆటుపోట్లు, ఎత్తుపల్లాలు, చీకటి వెలుగులు, పోరాట పటిమ గురించి సవివరంగా, సాధికారికంగా తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ చదవవలసిన సమగ్ర సత్ గ్రంథం యన్. టీ. ఆర్.

ఎన్టీఆర్ ముఖచిత్రంతో హస్తభూషణంగా తీర్చిదిద్దబడిన అమూల్యమైన ఈ పుస్తకం వెల రూ. 400 కాగా  విశాలాంధ్ర, నవోదయ, నవ చేతన, సాయి గణేష్, వాల్డన్ వంటి ప్రముఖ బుక్ స్టాల్స్‌తో పాటు అమెజాన్ ఆన్‌లైన్‌లో కూడా లభిస్తుంది.

Do You Know Who Is SR NTR First Crush :

Do You Know Who Is SR NTR First Crush   
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs