అవును మీరు వింటున్నది నిజమే.. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబుకు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభవార్త చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్, ఆయన వీరాభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ‘థ్యాంక్యూ జగన్ సార్..’ అని కొందరు.. ‘థ్యాంక్యూ రియల్ హీరో..’ అని మరికొందరు వీరాభిమానులు చెబుతున్నారు. అసలెందుకు థ్యాంక్స్..? ఆ శుభవార్తేంటి..? అనే ఆసక్తికర విషయాలు www.cinejosh.com కథనంలో తెలుసుకుందాం.
మహేశ్ బాబు, రష్మిక మందన్నా నటీనటులుగా సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా యమా జోరుగా ఉన్న చిత్రం ఇటీవలే మెగాస్టార్ చిరంజీవిని ముఖ్య అతిథిగా ఆహ్వానించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తూ చిత్రబృందం బిజిబిజీగా ఉంది.
ఇదిలా ఉంటే.. స్పెషల్ షోలు కోసమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దర్శకనిర్మాతలు అనుమతి కోరగా వైఎస్ జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఏపీ ప్రభుత్వం ‘సరిలేరు’ చిత్రానికి సంక్రాంతి పండుగ కానుక ఇచ్చిందన్న మాట. ఈ మేరకు జనవరి 11 నుంచి 17 వరకు స్పెషల్‌గా రెండు షోలు అదనంగా వేసుకోవచ్చంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. స్పెషల్ షోల అనుమతికై సినిమా నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ప్రభుత్వానికి లేఖ రాయగా పై విధంగా జగన్ సర్కార్ స్పందించింది. ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగనున్నాయి. జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మహేశ్ అభిమానులు.. ఆనందంలో మునిగి తేలుతూ ‘థ్యాంక్యూ జగన్ సార్’ అంటూ సోషల్ మీడియా వేదికగా చెబుతున్నారు.